Bengaluru Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు..అది ప్రెజర్‌ కుక్కర్ బాంబ్‌: సిద్ధరామయ్య

ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లో జరిగిన బాంబు పేలుడిపై రాజకీయాలు చేయడం తగదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) హితవు పలికారు. 

Updated : 02 Mar 2024 13:45 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లో పేలుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్‌ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) వెల్లడించారు. దీనిపై భాజపా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

‘‘ఈ విషయంలో భాజపా రాజకీయాలు చేస్తోంది. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..? నేను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లనున్నట్లు చెప్పారు.

అలాగే ఈ కేసు గురించి మాట్లాడారు. ‘‘మాస్క్, క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చాడు. రవ్వఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్‌ చేసి, వెళ్లిపోయాడు. అతడు ఎవరో తెలీదు.  ఫొటోలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం. పేలుడులో గాయపడిన వ్యక్తులు ప్రస్తుతం కోలుకుంటున్నారు’’ అని తెలిపారు. ఈరోజు పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ పేలుడులో మొత్తం 10 మంది గాయపడినట్లు చెప్పారు. ఆ నిందితుడి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇదిలా ఉంటే.. 2022 నవంబర్‌లో మంగళూరులో ఇదే తరహాలో కుక్కర్‌ బాంబు పేలింది. ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని