Siddaramaiah: ‘ఓటు చోరీ’తోనే నాడు ఓడిపోయా.. సిద్ధరామయ్య సెల్ఫ్‌ గోల్‌!

Eenadu icon
By National News Team Published : 29 Aug 2025 19:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఓటు చోరీ’ (Vote Chori) పేరుతో భాజపాతో పాటు ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్‌.. బిహార్‌లో ‘ఓట్‌ అధికార్‌ యాత్ర’ చేపట్టింది. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని చిక్కుల్లో పడేలా చేశాయి. గతంలో జేడీఎస్‌ అభ్యర్థిగా తాను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని, దానికి ఓట్ల చోరీనే (అప్పటి కాంగ్రెస్‌) కారణమంటూ వ్యాఖ్యానించారు. దీంతో ముఖ్యమంత్రి తన సొంత పార్టీ తీరును బయటపెట్టారని భాజపా కౌంటర్‌ ఇచ్చింది.

‘‘1991లో లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీచేసి ఓడిపోయా. ఆ ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లే ప్రతికూల ఫలితం వచ్చింది. దానిపై అడ్వకేట్‌ రవి వర్మ ద్వారా కేసు కూడా దాఖలు చేశా. ఆయన పైసా తీసుకోకుండా నా తరఫున పోరాడారు’’ అని సిద్ధరామయ్య వివరించారు. రాష్ట్ర మాజీ అడ్వకేట్‌ జనరల్‌గా చేసిన రవివర్మ కుమార్‌ సన్మాన కార్యక్రమంలో  సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు సొంత పార్టీని చిక్కుల్లో పడేశాయి.

1991 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌ అభ్యర్థిగా సిద్ధరామయ్య పోటీ చేయగా.. కాంగ్రెస్‌ తరఫున బసవరాజ్‌ పాటిల్‌ అన్వారీ పోటీ చేశారు. సుమారు 11వేల ఓట్ల మెజార్టీతో బసవరాజ్‌ గెలుపొందారు. ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లే తాను ఓడిపోయానని ఆరోపించిన సిద్ధరామయ్య.. ఆ ఎన్నికల తీర్పును కర్ణాటక హైకోర్టులో సవాల్‌ చేశారు. కౌంటింగ్‌ అధికారులు దాదాపు 22వేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించడంతోనే తాను ఓడిపోయాయని, లేదంటే అదే మెజార్టీతో గెలిచేవాడినని అప్పట్లో పేర్కొన్నారు.

భాజపా విమర్శలు..

సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను భాజపా ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌ ‘ఓటు చోరీ’పై గతంలో పోరాటం చేసిన వ్యక్తి.. అదే కాంగ్రెస్‌ తరఫున ‘ఓట్‌ అధికార్‌’ యాత్రలో పాల్గొనడం విడ్డూరమని పేర్కొంది. అప్పుడు బ్యాలెట్‌ పేపర్లపై, ఇప్పుడు ఓటరు జాబితాపై ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా సీనియర్‌ నేత అమిత్‌ మాలవీయ కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని