Train Collision: ‘నిద్రపోయిన లోకో పైలట్లు’.. ఆ రైలు ప్రమాదానికి కారణమిదే!

పంజాబ్‌లో ఇటీవల గూడ్స్‌ రైలు ప్రమాదానికి డ్రైవర్ల తప్పదమే కారణమని దర్యాప్తు అధికారులు నిర్ధరించారు.

Published : 07 Jun 2024 00:04 IST

దిల్లీ: పంజాబ్‌లో ఇటీవల గూడ్స్‌ రైలు (Indian Railways) ప్రమాదానికి గురైన ఘటనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దీనిపై దర్యాప్తు పూర్తిచేసిన అధికారులు.. ప్రమాదానికి డ్రైవర్ల తప్పదమే కారణమని తేల్చారు. లోకో పైలట్‌తో సహా అసిస్టెంట్‌ కూడా కునుకుతీశారని, ఈ క్రమంలో రెడ్‌ సిగ్నల్‌ పడినా బ్రేకులు వేయకపోయినట్లు నిర్ధరించారు. అందువల్లే ఈ ఘటన జరిగిందని.. ఈ విషయాన్ని రైలు డ్రైవర్లు (Loco Pilots) కూడా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

పంజాబ్‌లోని సర్హింద్‌ జంక్షన్‌, సాధూగఢ్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య జూన్‌ 2 తెల్లవారుజామున 3.15 గంటలకు గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. పక్కన ఉన్న మెయిన్‌ ప్యాసింజర్‌ లైన్‌పై గూడ్స్‌ ఇంజిన్‌ పడిపోయింది. అదే సమయంలో మరో లైనులో జమ్మూ తావీ స్పెషల్‌ రైలు దూసుకొచ్చింది. ఆ ట్రాకు దగ్గర్లో పడివున్న గూడ్స్‌ ఇంజిన్‌ను ఢీకొట్టడంతో జమ్మూ రైలు ఇంజిన్‌ కూడా పట్టాలు తప్పింది. ఆ సమయంలో జమ్మూ తావీ రైలు నెమ్మదిగా (గంటకు 46 కి.మీ) వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే భారీ ప్రమాదం తప్పిందని, వందలాది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

అంగీకరించిన డ్రైవర్లు..

ప్రమాదంలో గూడ్సు రైలు లోకో పైలట్‌, అసిస్టెంట్‌లు ఇంజిన్‌లో ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని అతికష్టం మీద బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది.. సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ప్రమాద సమయంలో తాము నిద్రపోయినట్లు ఇద్దరు డ్రైవర్లు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని రైల్వేశాఖ వెల్లడించింది. అయితే, డ్రైవర్ల కొరత కారణంగా తాము అదనపు సమయంలో పనిచేయాల్సి వస్తోందని రైల్వే ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని