ఆర్టిస్టు బహుమతికి వెయిటర్‌ ఫిదా!.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..

ఓ వెయిటర్‌కు స్కెచ్‌ ఆర్టిస్టు ఊహించని బహుమతి ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 15 Apr 2024 00:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రొటీన్‌ కంటే భిన్నంగా అనిపించే ప్రతి అంశాలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని కోపం తెప్పిస్తే, మరికొన్ని ఆనందం కలిగిస్తుంటాయి. ఇలా నెట్టింట వీడియోలు పంచుకొనే వారిలో కొందరేమో ఇతరులకు సంతోషం కలిగించే పనులు చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోనే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

ఆకాశ్‌ సెల్వరాసు అనే స్కెచ్ ఆర్టిస్టు తాను వేసిన చిత్రాలతో అందరి ముఖాల్లోనూ చిరునవ్వులు పూయిస్తుంటాడు. రెస్టారంట్‌లో సర్వ్‌ చేస్తున్న వెయిటర్‌, ప్రియుడితో కలిసి నదీ తీరాన సేద తీరుతున్న అమ్మాయి, అమ్మ చేతిలోని చంటిపాపాయి నవ్వు, మండుటెండలో కూరగాయలు అమ్ముతున్న బామ్మ.. ఇలా తన కళ్ల ముందు కనిపించే వ్యక్తుల దృశ్యాన్ని వెంటనే గీసేస్తాడు. అలా ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల ముఖంలో చిరునవ్వులు తెప్పిస్తుంటాడు. తాజాగా ఓ రెస్టారంట్లో పనిచేస్తున్న వెయిటర్‌ స్కెచ్‌ని వేశాడు ఈ ఆర్టిస్ట్‌. దానికి సంబంధిచిన వీడియోనే నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

పని పూర్తి చేసుకొని సేదరీరుతూ కూర్చున్న ఓ వెయిటర్‌ని గమనించాడు ఆకాశ్‌. వెంటనే తన చేతిలోని బిల్‌ పేపర్‌ తీసుకొని ఆ వ్యక్తి చిత్రాన్ని గీసి వెయిటర్‌కు అందించాడు. దాన్ని చూసిన వెయిటర్‌ ఆశ్చర్యపోయాడు. తనకే తెలియకుండా గీసిన ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. రెస్టారంట్‌లోని వారందరికీ చూపించి ఆ కాగితాన్ని గుండెలకు హత్తుకొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అందరి ముఖంలో చిరునవ్వును నింపండి, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలే కావాలి’, ‘నిజమైన సంతోషం అంటే ఇదే..’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని