DNA damage: ఆ అలవాట్లతో.. స్పెర్మ్‌ డీఎన్‌ఏకు ముప్పు!

ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్‌ ఆహారం, సెల్‌ఫోన్‌ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో స్పెర్మ్‌ డీఎన్‌ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్‌ (AIIMS) వైద్య నిపుణులు పేర్కొన్నారు.

Updated : 16 Apr 2024 19:17 IST

దిల్లీ: అనారోగ్యకరమైన జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్‌ ఆహారం, సెల్‌ఫోన్‌ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో స్పెర్మ్‌ డీఎన్‌ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్‌ (AIIMS) వైద్య నిపుణులు పేర్కొన్నారు. పురుషుల్లో వీర్య నాణ్యత తక్కువగా ఉండటం వల్ల వంధ్యత్వం (సంతాన లేమి), మహిళల్లో పదేపదే గర్భ విచ్ఛిత్తి, పిల్లల్లో పుట్టుకతో లోపాలు సంభవించే అవకాశం ఉంటుందనే విషయం చాలామందికి తెలియదన్నారు.

గర్భధారణ, పిండం అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించలేమని ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగం ప్రొఫెసర్‌ డా.రీమా దాదా పేర్కొన్నారు. వీర్యంలో తక్కువస్థాయి యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయని.. డీఎన్‌ఏను చక్కబెట్టే వ్యవస్థ నిష్ర్కియగా ఉంటుందన్నారు. అందువల్ల ‘‘అనారోగ్య జీవనశైలి, ధూమపానం, మద్యపానం, సెల్‌ఫోన్‌ విపరీత వాడకం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, కేలరీలు అధికంగా ఉండే పోషకాలు లేని ఆహారం, ఊబకాయం, కాలుష్యం వంటివి స్పెర్మ్‌ డీఎన్‌ఏ దెబ్బతినడానికి కారణమవుతాయి’’ అని డా.రీమా పేర్కొన్నారు. వీటికితోడు వివాహం, గర్భధారణ ఆలస్యం చేయడం కూడా వీర్యం నాణ్యత మరింత క్షీణించడానికి దారి తీస్తుందన్నారు.

‘‘వయసు పెరుగుతున్నకొద్దీ స్పెర్మ్‌ డీఎన్‌ఏ నాణ్యత క్షీణిస్తుంది. దెబ్బతిన్న వీర్యం కారణంగా పుట్టే పిల్లల్లో జన్యు లోపాలు, వైకల్యం, క్యాన్సర్లతోపాటు ఆటిజం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గర్భం దాల్చడంలో వైఫల్యం, గర్భవిచ్ఛిత్తి పునరావృతం వంటి వాటికి... అధిక మోతాదులో డీఎన్‌ఏ దెబ్బతినడానికి సంబంధం ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తేలింది’’ అని డాక్టర్‌ రీమా వెల్లడించారు.

పురుషులు జాగ్రత్త..!

తమ అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటివి జన్యువులపై ప్రభావం చూపుతోందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ రీమా దాదా పేర్కొన్నారు. ఆరోగ్యకర జీవనశైలి, నిత్యం యోగా చేయడం వంటివి వాటితో మైటోకాండ్రియల్‌, డీఎన్‌ఏ సామర్థ్యం పెరుగుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని