Shraddha Murder: ప్రేమిస్తే ఎలా ముక్కలు చేస్తారు..? శ్రద్ధా హత్యపై స్మృతి ఇరానీ వ్యాఖ్య

శ్రద్ధా వాకర్ హత్యపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. గృహ హింస గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. 

Updated : 25 Nov 2022 16:20 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తెలిసినవారు, సన్నిహిత భాగస్వాముల వల్ల మహిళలపై జరిగే హింసను తప్పకుండా చర్చించాల్సి ఉందని ఆమె అన్నారు. ఓ చర్చావేదికలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. 

‘ఎంతగా ఆవేశం వచ్చినా ఎవరూ ఒక మహిళను ముక్కలుగా చేయరు. తాను ప్రేమిస్తున్నానని చెబుతూనే క్షణికావేశంలో ఆమెపై హింసకు పాల్పడలేరు. ఈ ఘటనలో వాస్తవమేంటంటే.. ఆమె (శ్రద్ధా)పై చాలా రోజుల పాటు వేధింపులు కొనసాగాయి. ఆమెను వేధిస్తున్నారన్న సంగతి చాలా మందికి తెలుసు కూడా..! మహిళల భద్రత గురించి మాట్లాడేప్పుడు.. సన్నిహిత భాగస్వాములు, కుటుంబసభ్యులు, బంధువుల చేతుల్లో వారు ఎదుర్కొనే హింస గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దగా చదువుకోని పురుషులు మహిళలపై చేయిచేసుకుంటారని గతంలో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా గృహహింస కనిపిస్తోంది’ అని అన్నారు.

మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘మనం ఘోర హత్యను తక్కువ చేస్తున్నామనిపిస్తోంది. ఆ హత్యకు పాల్పడిన వ్యక్తిపై మనం దృష్టి పెట్టాలి. అక్కడి నుంచి పక్కకు జరగకూడదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు ఒక అత్యాచార నిందితుడు మసాజ్‌ చేస్తోన్న వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రిని ప్రశ్నించగా.. అది తనను షాక్‌కు గురిచేసిందన్నారు. భారత రాజకీయాల్లో ఇలాంటివి ఎన్నడూ చూడలేదన్నారు. జైలు వీడియోలు చూసిన తర్వాత కేజ్రీవాల్‌ నోట మాటలు రావడం లేదేమోనని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని