Smriti Irani: చెప్పినట్టుగానే అమేఠీలో ఇల్లు కట్టి.. గృహప్రవేశం చేసిన స్మృతిఇరానీ

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ(Amethi) సీటు హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా కేంద్రమంత్రి స్మృతిఇరానీ(Smriti Irani) అక్కడ వేడుక నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Published : 22 Feb 2024 19:05 IST

అమేఠీ: చెప్పినట్టుగానే తన నియోజకవర్గం అమేఠీ(Amethi)లో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani). గురువారం తన భర్త జుబిన్‌ ఇరానీతో కలిసి గృహప్రవేశం కూడా చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జరిగిన ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది.

2019 ఎన్నికల్లో తాను గెలిస్తే అమేఠీ(Amethi) తన శాశ్వత చిరునామాగా మారుతుందని అప్పటి ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ(Smriti Irani) హామీ ఇచ్చారు. ఆ తర్వాత గాంధీల కంచుకోట అయిన ఆ నియోజకవర్గంలో రాహుల్‌గాంధీని ఓడించి, ఓటర్లు ఆమెకు విజయం కట్టబెట్టారు. దాంతో చెప్పినట్టుగానే ఆమె 2021లో 15వేల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2023లో ‘కిచ్డీభోజ్‌’ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించి తాజాగా గృహప్రవేశం చేశారు. ఉజ్జయిని నుంచి వచ్చిన పూజారి ఆశిశ్‌ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. 

2014 నుంచి రాహుల్‌, స్మృతి ఇరానీ అమేఠీ(Amethi) నుంచి పోటీపడుతున్నారు. 2014లో ఓడిన ఆమె.. 2019లో విజయభేరీ మోగించి సంచలనం సృష్టించారు. దాంతో 2004 నుంచి 15 ఏళ్లుగా ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న రాహుల్‌కు ఆ ఓటమి పరాభవాన్ని మిగిల్చింది. 2024లో మరోసారి వారు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆ పోరు ఆసక్తిగా మారనుంది.

అమేఠీ(Amethi) నుంచి రాహుల్ పోటీ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని, అయితే తుది నిర్ణయం త్వరలో వెలువడుతుందని ఇటీవల కాంగ్రెస్ వెల్లడించింది. ఆయన మరోసారి ఇక్కడినుంచి పోటీ చేయాలని కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి(Smriti Irani) సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ అమేఠీకి చేరుకున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్మానుష్య వీధులు ఆయనకు స్వాగతం పలికాయంటూ ఎద్దేవా చేశారు. న్యాయయాత్ర ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడే ఆమె కూడా పర్యటించారు. ఇద్దరు నేతలు ఒకేసారి ఇక్కడికి రావడం ఐదేళ్లలో ఇది రెండోసారి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని