Smriti Irani: జైరాం రమేశ్‌ నారీశక్తి వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

భాజపా ప్రభుత్వం చేస్తున్న నారీ శక్తి నినాదాలు ఉత్తి మాటలుగా మిగిలిపోయాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌ చేసిన ఆరోపణలపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.

Published : 26 Mar 2024 13:43 IST

దిల్లీ: భాజపా ప్రభుత్వం చేస్తున్న నారీశక్తి నినాదాలు ఉత్తి మాటలుగా మిగిలిపోయాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) చేసిన ఆరోపణలపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఆరోపణలను తిప్పి కొడుతూ గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. ‘చాలా కాలం నుంచి దేశానికి నిజమైన వారసులమంటూ చెప్పుకొంటున్న వంశ పాలకులు దేశ సంపదను దోచుకున్నారు. పార్టీ పతనమైనా వారి అనుచరులు వాస్తవాలను వక్రీకరిస్తూనే ఉన్నారు. మహిళా సంక్షేమం కోసం భాజపా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అణగదొక్కడానికి గణాంకాలను తారుమారు చేస్తున్నార’ని దుయ్యబట్టారు. జైరాం రమేశ్‌ను గాంధీల కోర్టియర్‌ (సభికుడి)గా ఆమె అభివర్ణించారు. 

గత పదేళ్లలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ భారీ వైఫల్యాలకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితా కాంగ్రెస్‌ పార్టీ తాజాగా విడుదల చేసింది. 2024 జూన్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలకు 10 సంవత్సరాల అన్యాయ్‌ కాల్‌ ముగుస్తుందని జైరాం రమేశ్‌ అన్నారు. ‘దేశమంతటా మహిళలపై దాడులు జరుగుతున్నప్పుడు మంత్రి స్మృతీ ఇరానీ మౌనంగా ఉండి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో నేరాలకు మాత్రమే మేల్కొంటారు. ఆమె మంత్రిత్వశాఖ అభివృద్ధికి అవసరమయ్యే నిధులను మళ్లిస్తున్నార’ని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ఆయన వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ మహిళల భద్రత కోసం యూపీఏ ప్రభుత్వ హయాంలో ‘నిర్భయ ఫండ్‌’ ఏర్పాటు చేసినా అందులో నుంచి వాళ్లు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. అదే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా 40 ప్రాజెక్టులు రూపొందించినట్లు  చెప్పారు. ‘2023-24 నాటికి మొత్తం రూ.7212.85కోట్లు కేటాయించగా ప్రస్తుతం వీటిలో 75శాతం ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల కోసం వినియోగించాము’ అని పేర్కొన్నారు.

నిర్భయ కాల్‌ సెంటర్లు, వన్‌స్టాప్‌ సెంటర్లు, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు మహిళలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. అంగన్వాడీలకు గౌరవ వేతనాన్ని అందించడమే కాకుండా ప్రతిదీ ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసేందుకు అవసరమైన డేటా వినియోగం కోసం రూ.2,000 అదనంగా ఇస్తున్నామని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం జీవన జ్యోతి, సురక్ష బీమా యోజన వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వం స్త్రీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా దేశ పురోగతికి మార్గదర్శకులుగా భావిస్తోందని తెలిపారు.

కాగా, భాజపా ఐదు భారీ వైఫల్యాలుగా కాంగ్రెస్ పేర్కొన్న జాబితాలో మహిళలు, బాలికలపై నేరాల రెట్టింపు, అంగన్వాడీ ఆశావర్కర్లకు తక్కువ వేతనాలు, మహిళలు, బాలికల్లో రక్తహీనత పెరుగుదల, పెరిగిన నిరుద్యోగ మహిళల సంఖ్య ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని