Pre Wed Shoot: -22 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రీ వెడ్‌ షూట్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

వినూత్నంగా ఉండాలని మంచు కురిసే ప్రాంతంలో ప్రీ వెడ్ షూట్‌ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌ హైపోథెర్మియాకు గురైన ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Published : 21 Mar 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కాలంతోపాటే ట్రెండ్‌ మారుతోంది. ముఖ్యంగా వివాహబంధంతో జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టే జంటలకు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ (Pre Wedding Shoot) తప్పనిసరి అవుతోంది. వినూత్నంగా ఉండేందుకు అడవుల్లో, సముద్రగర్భంలో, ఎత్తైన కొండ ప్రాంతాలతోపాటు.. కొందరు విచిత్రంగా బురదలోనూ ఫొటోషూట్‌ చేసిన ఘటనలను మనం చూశాం. తాజాగా ప్రీ వెడ్‌ షూట్‌ కోసం మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి వెళ్లిన ఓ ఇన్‌ప్లూయెన్సర్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 

మంచులో ప్రీ వెడ్ షూట్‌ చేయాలనేది ఆర్య వోరా అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కల. ఇందుకోసం గత వారం ఆమె కాబోయే భర్తతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌లో మంచు కురిసే ప్రాంతానికి చేరుకున్నారు. మంచులో ఇద్దరూ చేయిచేయీ పట్టుకుని నడుస్తున్నట్లు వీడియో తీసుకోవాలని ప్లాన్‌ చేశారు. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రత -22 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా ఉంది. అనుకున్నట్లుగానే షూట్‌ చేశారు. వెచ్చని దుస్తులు ధరించకపోవడంతో షూట్‌ తర్వాత తాను హైపోథెర్మియా (శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం)కు గురైనట్లు ఆర్య తెలిపారు. ‘‘ షూట్‌ తర్వాత నాపై ఎవరో యాసిడ్‌ పోస్తున్నట్లు అనిపించింది. ఆ బాధను భరించలేకపోయాను. అదృష్టవశాత్తూ.. రాన్‌ (కాబోయే భర్త), నా స్నేహితులు ఆ పరిస్థితి నుంచి బయపడేందుకు సాయం చేశారు’’ అని పేర్కొన్నారు. 

ఈ వీడియోపై రాన్‌ స్పందిస్తూ.. ‘‘ఆ ప్రాంతం చాలా చల్లగా ఉంది. షూట్‌ అయిపోగానే ఆర్య చలితో తీవ్రంగా ఇబ్బందిపడింది. అటువంటిచోట్ల వెచ్చగా ఉండే దుస్తులు ధరించకపోతే శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కానీ, ఆర్య ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోవాలని షూట్‌కు ముందుకొచ్చింది. ఇతరులతో మా అనుభవాన్ని పంచుకోవాలని దీన్ని షేర్‌ చేస్తున్నాం’’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆర్యకు మద్దతుగా, మరికొందరు ఆమె చర్యను తప్పుబడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టాలా?’, ‘ఇది పిచ్చి పని’, ‘ రెండు నిమిషాల స్లో మోషన్‌ వీడియో కోసం ఇలాంటి పనులు చేస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని