IndiGo: కేవలం 2 నిమిషాల ఇంధనం ఉండగా ల్యాండింగ్‌.. ఇండిగోలో భద్రతా వైఫల్యం..!

దిల్లీకి బయల్దేరిన ఇండిగో (IndiGo) విమానంలోని ప్రయాణికులు భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. 

Updated : 15 Apr 2024 12:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అయోధ్య నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో (IndiGo) విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. వాతావరణం సహకరించకపోవడంతో దానిని చండీగఢ్‌కు మళ్లించారు. అయితే, అక్కడ ల్యాండింగ్‌ జరిగేటప్పుడు విమానంలో కేవలం రెండు నిమిషాలకు సరిపడా ఇంధనమే మిగిలి ఉంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

‘‘సాయంత్రం 3.25కు అయోధ్య నుంచి విమానం బయల్దేరింది. అదేరోజు 4.30 గంటలకు దిల్లీకి చేరుకోవాలి. అయితే, గమ్యస్థానానికి 15 నిమిషాల ముందు పైలట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. వాతావరణం సహకరించకపోవడంతో విమానం ల్యాండింగ్‌ క్లిష్టంగా మారిందని, ఇంధనం అయిపోతోందని తెలిపారు. ఇది ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. అయితే విమానం అక్కడక్కడే గాల్లో తిరుగుతూ రెండుసార్లు ల్యాండింగ్‌కు యత్నించినా ఫలితం లేదు. చివరకు చండీగఢ్‌కు మళ్లించారు. అక్కడ సురక్షితంగా దింపారు. అయితే ఆ సమయానికి విమానంలో కేవలం 1-2 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలి ఉండగా.. మేం ల్యాండ్ అయ్యామని తెలిసింది’’ అని ఒక ప్రయాణికుడు ఘటన మొత్తాన్ని ఓ పోస్టులో వివరించారు.

అలాగే దీనిని డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), పౌర విమానయాన శాఖకు ట్యాగ్ చేశారు. మీరు అసలు నియమావళిని పాటించారా..? అని ఇండిగో (IndiGo) సంస్థను ప్రశ్నించారు. ఇది పూర్తి భద్రతా వైఫల్యం.. దీనిపై డీజీసీఏ దర్యాప్తు చేయాలని మరో ప్రయాణికుడు డిమాండ్ చేశారు. అయితే ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం.. ఒకసారి మాత్రమే దిల్లీలో దింపేందుకు పైలట్‌ ప్రయత్నించారని, రెండోయత్నానికి అనుమతి లభించకపోవడంతో చండీగఢ్‌కు మళ్లించినట్లు ఉంది. దీనిపై విమానయాన సంస్థ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందనా రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని