Bilkis Bano case: బిల్కిస్‌ బానో కేసు.. దోషుల్లో 9 మంది మిస్సింగ్‌!

Bilkis Bano case: బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదల చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో వారు తిరిగి జైల్లో లొంగిపోవాల్సి ఉంది. అయితే దోషుల్లో 9 మంది ప్రస్తుతం కన్పించకుండా పోయినట్లు తెలుస్తోంది.

Updated : 10 Jan 2024 16:01 IST

దాహోద్‌: బిల్కిస్‌ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో ఏడుగురు సభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల (Convicts) శిక్షా కాలం తగ్గింపుని రద్దు చేస్తూ జనవరి 8న సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. రెండు వారాల్లోగా దోషుల్ని తిరిగి జైలుకు పంపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ, ఈ తీర్పు వెలువడిన నాటి నుంచి దోషుల్లో 9 మంది అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈ కేసులోని దోషులంతా దాహోద్‌ జిల్లాలోని రాంధిక్‌పుర్‌, సింగ్వాద్‌ గ్రామాలకు చెందిన వారు. గోధ్రా అల్లర్ల నాటి వరకు బిల్కిస్‌ బానో కుటుంబం కూడా రాంధిక్‌పుర్‌లో నివసించేది. గత ఆదివారం వరకూ వీరంతా ఊర్లోనే కన్పించినట్లు స్థానికులు చెబుతున్నారు. సుప్రీం తీర్పు వెలువడ్డాక ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. వారం క్రితమే తమ కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు దోషుల్లో ఒకడైన గోవింద్‌ నాయ్‌ తండ్రి మీడియాకు తెలిపారు.

గదిలో దగ్గుమందు.. ఓవర్‌డోస్‌ ఇచ్చి చంపేసిందా?: ‘సీఈవో’ కేసులో కీలక విషయాలు

ఈ వార్తలపై దాహోద్‌ ఎస్పీ స్పందిస్తూ.. దోషుల లొంగుబాటుపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించారు. అయితే వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనుమానించలేమని తెలిపారు. కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. తమకు ఇంకా సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందలేదన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా తీర్పు వెలువడిన నాటి నుంచి దోషుల స్వగ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.

2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో(Bilkis Bano) కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు దీన్ని సమర్థించింది. దోషులు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. 2022లో వీరికి గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది. ఆ ఏడాది ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు.. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. వారి విడుదల చెల్లదని తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని