Modi: రష్యా-ఉక్రెయిన్‌పై మేం తటస్థం కాదు.. అమెరికా పత్రికకు మోదీ ఇంటర్వ్యూ

ప్రధాని మోదీ (PM Modi) నేడు అమెరికా పర్యటనకు బయల్దేరారు. అంతకుముందు ఓ అమెరికా పత్రికతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, చైనాతో సంబంధాలు వంటి పలు అంశాల గురించి ఆయన ప్రస్తావించారు.

Published : 20 Jun 2023 14:10 IST

దిల్లీ: ఉక్రెయిన్‌పై ఏడాదికి పైగా రష్యా సాగిస్తున్న దండయాత్ర (Russia Ukraine conflict) విషయంలో భారత్ (India) తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమ దేశాలు ఆ మధ్య ఆరోపించాయి. దీనిపై తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) స్పందించారు. తాము శాంతి వైపే ఉన్నామని చెప్పారు. అమెరికా (USA) పర్యటనకు బయల్దేరే ముందు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు భారత్‌-చైనా సంబంధాలు, అమెరికాతో బంధం.. ఇలా పలు అంశాల గురించి మోదీ స్పందించారు.

‘‘మేం తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నామని కొంతమంది అన్నారు. కానీ మేం తటస్థం కాదు. శాంతి వైపు నిలబడుతున్నాం. దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశం గౌరవించాలి. దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతేగానీ యుద్ధంతో కాదు’’ అని మోదీ తెలిపారు. సమస్య పరిష్కారం కోసం రష్యా (Russia), ఉక్రెయిన్‌ (Ukriane) దేశాల అధినేతలు పుతిన్‌, జెలెన్‌స్కీతో తాను పలుమార్లు మాట్లాడినట్లు ప్రధాని గుర్తుచేశారు. ‘‘భారత్‌ ఏం చేయగలదో అన్నీ చేస్తోంది. ఘర్షణలను పరిష్కరించి ఇరు దేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలను మేం సమర్థిస్తున్నాం’’ అని మోదీ (PM Modi) తెలిపారు.

సరిహద్దుల్లో ప్రశాంతతే ముఖ్యం..

ఇక, భారత్‌-చైనా మధ్య సంబంధాల (India-China Relations) గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ద్వైపాక్షిక బంధాలు నిలబడాలంటే.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత, నిశ్చలమైన పరిస్థితులు చాలా ముఖ్యం. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపై మాకు విశ్వాసం ఉంది. అదే సమయంలో, భారత్‌ తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

ఏ దేశ స్థానాన్నీ భర్తీ చేయాలనుకోవట్లేదు..

భారత్‌ - అమెరికా (India-US) మధ్య బంధం మునుపటి కంటే మరింత బలంగా ఉందని ప్రధాని అన్నారు. ఇరు దేశాల నేతల మధ్య అమితమైన విశ్వాసం ఉందన్నారు. ఇక ప్రపంచ రాజకీయాల గురించి స్పందిస్తూ.. ‘‘ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో విస్తృత పాత్ర పోషించేందుకు భారత్‌ అర్హమైనదే. విద్య, మౌలిక సదుపాయాల్లో భారత్‌ విస్తృత పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిస్థితుల్లో తయారీ, సరఫరా గొలుసును పెంపొందించేందుకు బహుళజాతీ సంస్థలు మావైపు చూస్తున్నాయి. అయితే మేం ఏ దేశ స్థానాన్నీ భర్తీ చేయాలనుకోవట్లేదు. కేవలం ప్రపంచంలో మేం సరైన స్థానాన్ని దక్కించుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాం’’ అని మోదీ (Modi) వివరించారు.

అలా తొలి ప్రధానిని నేనే..

స్వాతంత్ర్య భారత దేశంలో పుట్టిన తొలి ప్రధానమంత్రిని నేనే. అందుకే, నా ఆలోచనా విధానాలు, ప్రవర్తన అన్నీ.. మా దేశ చరిత్ర, సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందినట్లుగానే ఉంటాయి. అదే నా బలం. దీన్నే నేను ప్రపంచానికి పరిచయం చేస్తున్నా’’ అని మోదీ తెలిపారు.

ప్రధాని మోదీ నేడు అమెరికా పర్యటనకు బయల్దేరారు. బుధవారం నుంచి ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఐరాసలో జరిగే అంతర్జాతీయ యోగా వేడుకలకు ఆయన నేతృత్వం వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆతిథ్యాన్ని స్వీకరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని