Mulayam Singh Yadav: ములాయం సింగ్‌ ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స!

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ (Mulayam singh Yadav) ఆరోగ్యం విషమించినట్టు సమాచారం.......

Updated : 02 Oct 2022 18:20 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ (Mulayam singh Yadav) ఆరోగ్యం విషమించినట్టు సమాచారం. దీంతో ఆయన్ను హరియాణా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని అనారోగ్య కారణాల రీత్యా ఆగస్టు 22 నుంచి  ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న 82ఏళ్ల ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం ఆదివారం క్షీణించడంతో ఆయన్ను ఐసీయూ వార్డులోకి మార్చినట్టు సమాచారం. ములాయం ఆరోగ్యం విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన్ను ఐసీయూకి మార్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్య నిపుణులు డాక్టర్‌ నితిన్‌ సూద్‌, డాక్టర్‌ సుశీల్‌ కటారియా పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నట్టు సమాచారం. 

ములాయం రొటీన్‌ చెకప్‌ కూడా ఇదే ఆస్పత్రిలోనే జరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది జులైలో నలతగా ఉండటంతో ఆయన ఇదే ఆస్పత్రిలో చేరి చికిత్సపొందారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై  సమాచారం అందుకున్న ములాయం తనయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ దిల్లీకి బయల్దేరారు. అలాగే, ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌ కూడా ఇప్పటికే దిల్లీలో ఉన్నారు. ఆయన ఈరోజే గురుగ్రామ్‌కు వెళ్లే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని