Azam Khan: ‘ఎన్‌కౌంటర్‌ కావొచ్చేమో’.. వేర్వేరు జైళ్లకు తండ్రీ, కుమారుడు!

నకిలీ జనన ధ్రువపత్రం (Fake Birth certificate) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌తోపాటు (Azam Khan) ఆయన కుమారుడు అబ్దుల్లాలను వేర్వేరు జైళ్లకు తరలించారు.

Published : 22 Oct 2023 15:43 IST

రామ్‌పుర్‌: నకిలీ జనన ధ్రువపత్రం (Fake Birth certificate) కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌తోపాటు (Azam Khan) ఆయన కుమారుడు అబ్దుల్లాలను వేర్వేరు జైళ్లకు తరలించారు. ఆజం ఖాన్‌ను సీతాపుర్‌ జిల్లా జైలుకు తరలించగా.. ఆయన కుమారుడిని మాత్రం హర్దౌ జిల్లా జైలుకు పంపించారు. ఈ క్రమంలో తమను ‘ఎన్‌కౌంటర్‌ చేస్తారేమో.. ఏదైనా జరగవచ్చు’ అంటూ ఆజం ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వేరే జైలుకు తరలించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. భారీ భద్రత మధ్య ఇద్దరు నేతలను పోలీసులు వేర్వేరు జైళ్లకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు.

రామ్‌పుర్‌ జైలు నుంచి బయటకు తీసుకువచ్చిన సమయంలో ఆజం ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్‌కౌంటర్‌ చేయొచ్చేమో.. నాకు, నా కుమారుడికి ఏమైనా జరగొచ్చు’ అని అక్కడే ఉన్న రిపోర్టర్లతో పేర్కొన్నారు. సీతాపుర్‌ జైలుకు తీసుకెళ్తున్న సమయంలో వాహనం వెనక సీట్లో కూర్చోవాలని ఆజం ఖాన్‌ను పోలీసులు అడిగారు. అందుకు నిరాకరించిన ఆయన.. వెన్నునొప్పి కారణంగా మధ్యలో కూర్చోలేనని, కిటికీ ఉన్న సీట్లో కూర్చుంటానని చెప్పడం వినిపించింది.

దుబాయ్‌ నుంచి మహువా ఐడీని వాడారు.. దుబే మరో సంచలన ఆరోపణ

తప్పుడు జనన ధ్రువపత్రం కేసులో సమాజ్‌వాదీ సీనియర్‌ నేత ఆజం ఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఖాన్‌లతోపాటు భార్య తజీన్‌ ఫాతిమాలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ముగ్గురుకి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.15వేల జరిమానా విధించింది. దీంతో వీరిని ఇటీవలే రామ్‌పుర్‌ జైలుకు తరలించారు. తండ్రీ, కుమారుడిని ఆదివారం ఉదయం 4.40గంటలకు బయటకు తీసుకురాగా.. సుమారు 9గంటల ప్రాంతంలో వేరే జైళ్లకు చేర్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇదే కాకుండా వివిధ కేసులకు సంబంధించి ఎస్పీ నేత ఆజం ఖాన్‌ గతంలో రెండేళ్లు సీతాపుర్‌ జైల్లోనే ఉన్నాడు. అయితే, సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో గతేడాది (మే 2022లో) బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా నకిలీ ధ్రువపత్రం కేసులో ఏడేళ్ల శిక్ష పడటంతో ఆయన్ను మళ్లీ సీతాపుర్‌ జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని