MK Stalin: మాజీ సీఎం జయలలితను కొనియాడిన స్టాలిన్‌.. ఎందుకంటే..?

యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రి ఉండాలని జయలలిత భావించి ఉండొచ్చని.. ఇందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు.

Updated : 22 Nov 2023 07:54 IST

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో (Tamilnadu Politics) ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ సంగీత, లలిత కళల యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ‘ముఖ్యమంత్రి’ని నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తాను రాజకీయాలు మాట్లాడటం లేదని.. వాస్తవాలు చెబుతున్నానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. కేవలం ముఖ్యమంత్రి ఛాన్సలర్‌గా ఉంటేనే విద్యాసంస్థ వృద్ధి చెందుతుందన్నారు. ఇతరులు ఈ పదవిలో ఉంటే.. వృద్ధి సాధించాలనే సంకల్పమే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని పరిగణనలోకి తీసుకునే యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రి ఉండాలని జయలలిత భావించి ఉండొచ్చని అన్నారు. ఇందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాలన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని తాను కూడా హృదయపూర్వకంగా జయలలితను అభినందిస్తున్నానని అన్నారు.

సంగీతం కోసం దేశంలో ఏర్పాటు చేసిన ఏకైక యూనివర్సిటీ ఇదేనని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఛాన్సలర్‌గా ఉండే యూనివర్సిటీ ఇదొక్కటేనని.. ఇతర ఉన్నతవిద్యా సంస్థలకు ఇది భిన్నమని చెప్పారు. విశ్వవిద్యాలయాలకు కులపతులుగా గవర్నర్‌ ఉండటాన్ని కొందరు ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్న వేళ స్టాలిన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదిలాఉంటే, పూర్తిస్థాయి రాష్ట్ర నిధులతో నడిచే ఈ యూనివర్సిటీని 2013లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేశారు. తానే మొదటి ఛాన్సలర్‌గా వ్యవహరించారు. 2019లో అన్నాడీఎంకే ప్రభుత్వం దానికి జయలలిత యూనివర్సిటీగా నామకరణం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని