NEET Irregularities: నీట్‌ అక్రమాలపై విచారణ జరిపించాలి

నీట్‌ పరీక్షలో అవకతవకలపై విచారణ జరిపించాలని వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాల సభ్యులు డిమాండ్‌ చేశారు.

Updated : 11 Jun 2024 04:57 IST

విద్యామంత్రిత్వశాఖ వద్ద ఆందోళన

దిల్లీ: నీట్‌ పరీక్షలో అవకతవకలపై విచారణ జరిపించాలని వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాల సభ్యులు డిమాండ్‌ చేశారు. దిల్లీలోని కేంద్ర విద్యామంత్రిత్వశాఖ కార్యాలయం సమీపంలో సోమవారం వీరు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడేందుకు మరింత విశ్వసనీయమైన విధానాన్ని ఏర్పాటు చేయాలని, నీట్‌ పరీక్ష అక్రమాలపై పారదర్శక విచారణ జరిపించాలని ‘జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం’ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు అవిజిత్‌ ఘోష్‌ డిమాండ్‌ చేశారు. విశ్వసనీయమైన, సురక్షితమైన వ్యవస్థను తీర్చిదిద్దాలని విజ్ఞప్తిచేశారు. వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు కొనసాగుతున్నాయి. మొదటి ర్యాంకును ఏకంగా 67 మంది పంచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


గట్టిచర్యలు చేపట్టాలి

-ప్రియాంక 

పరీక్షల్లో అవకతవకల నివారణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ డిమాండ్‌ చేశారు. ‘లక్షల మంది విద్యార్థులు ఇలాంటి పరీక్షలకు ఎంతో శ్రమించి సిద్ధపడతారు. జీవితంలో విలువైన సమయాన్ని వెచ్చిస్తారు. యావత్‌ కుటుంబం ఆ విద్యార్థులపై విశ్వాసాన్ని ఉంచుతుంది. ఏటేటా ప్రశ్నపత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీటిని నిర్వహించే సంస్థలకు జవాబుదారీతనాన్ని నిర్ణయించాలి కదా? పరీక్షల్లో నిర్లక్ష్యంపై కేంద్రం దృష్టి సారించాలి కదా?’ అని ప్రశ్నించారు. కష్టపడే విద్యార్థులకు అన్యాయం జరగడాన్ని సహించబోమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని