Sundar Pichai: గూగుల్‌ సీఈవో చిన్ననాటి ఇల్లు విక్రయం.. తండ్రి కన్నీటిపర్యంతం!

చెన్నైలో సుందర్‌ పిచాయ్‌ నివసించిన ఇంటి స్థలాన్ని ఆయన తండ్రి విక్రయించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారని ఆ ఆస్తిని కొనుగోలు చేసిన తమిళ సినీ నటుడు, నిర్మాత సి.మణికందన్ వెల్లడించారు.

Updated : 20 May 2023 13:31 IST

చెన్నై: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) తమిళనాడు (Tamil Nadu)లో పుట్టి పెరిగిన ఇంటిని విక్రయించారు. తమిళ సినీ నటుడు, నిర్మాత సి.మణికందన్ (C Manikandan) కొనుగోలు చేశారు. చెన్నై (Chennai)లోని అశోక్‌ నగర్‌లో సుందర్ పిచాయ్ నివసించిన ఇల్లు (Sundar Pichai Home) అమ్మకానికి ఉందని తెలిసిన క్షణమే దాని కొనుగోలుకు మణికందన్‌ ముందుకు వచ్చినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఆ ఇంటిని కూల్చివేసి, స్థలానికి సంబంధించిన ఆస్తి పత్రాలు అందజేసే సమయంలో సుందర్‌ తండ్రి రఘునాథ పిచాయ్‌ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారని మణికందన్‌ వెల్లడించారు.

‘సుందర్ పిచాయ్ మన దేశాన్ని గర్వపడేలా చేశారు. ఆయన నివసించిన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయడం నా జీవితంలో గర్వించదగ్గ విజయం’ అని మణికందన్ పేర్కొన్నారు. స్థిరాస్తి కొనుగోలు లావాదేవీలు సాగుతోన్న వేళ సుందర్‌ తల్లిదండ్రుల మర్యాద తనను కదిలించిందని తెలిపారు. ‘సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చారు. ఆయన తండ్రి మొదటి సమావేశంలోనే నాకు సంబంధిత పత్రాలు అందించారు. వారి వినయపూర్వక వ్యవహార శైలిని చూసి ఆశ్చర్యపోయా’ అని వెల్లడించారు.

‘సుందర్‌ తండ్రి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గంటల తరబడి వేచి ఉన్నారు. నాకు పత్రాలు ఇవ్వడానికి ముందు అవసరమైన అన్ని పన్నులు చెల్లించారు. ఇంటిని కూల్చేందుకు అయిన ఖర్చునూ భరించారు. ఇది ఆయన మొదటి ఆస్తి కాబట్టి.. పత్రాలను అందజేసేటప్పుడు భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు’ అని మణికందన్ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఐఐటీ ఖరగ్‌పుర్‌కు వెళ్లేవరకు సుందర్‌ పిచాయ్‌ తన 20 ఏళ్ల వరకు ఈ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. గతేడాది ఓసారి చెన్నైకి వచ్చి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని