Dzhaparova: ఉక్రెయిన్‌కు మద్దతు.. ‘విశ్వగురువు’కు న్యాయం అనిపించుకుంటుంది!

రష్యా సైనిక చర్య కొనసాగుతోన్న వేళ.. తమ దేశానికి మద్దతు పలకడమే నిజమైన విశ్వగురువుకు న్యాయం అనిపించుకుంటుందని ఉక్రెయిన్‌ ఉప విదేశాంగ మంత్రి జాపరోవా.. భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆమె భారత్‌కు చేరుకున్నారు.

Updated : 13 Apr 2023 12:12 IST

దిల్లీ: ఏడాదికిపైగా సాగుతోన్న రష్యా (Russia) దాడులతో ఉక్రెయిన్‌ (Ukraine) అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తమ దేశానికి మద్దతు పలకడమే నిజమైన విశ్వగురువుకు న్యాయం అనిపించుకుంటుందని ఉక్రెయిన్‌ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్‌ జాపరోవా (Emine Dzhaparova).. భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 3డీ విధానాలు (ప్రజాస్వామ్యం (Democracy), చర్చలు (Dialouge), వైవిధ్యం (Diversity)) ఉక్రెయిన్‌కు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. నాలుగు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా జాపరోవా దిల్లీకి చేరుకున్నారు. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు ఉక్రెయిన్‌ ప్రతినిధులు అధికారికంగా భారత్‌ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.

ఈ క్రమంలోనే జాపరోవా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి(పశ్చిమ దేశాలకు) సంజయ్‌వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ‘రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ సాగిస్తోన్న పోరాటాన్ని వివరించా. మా దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికతోపాటు ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం ఎగుమతుల కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని భారత్‌ను ఆహ్వానించా’ అని భేటీ అనంతరం జాపరోవా ట్వీట్ చేశారు. ‘నేడు భారత్‌ ఓ విశ్వగురువుగా, మధ్యవర్తిగా ఎదగాలని భావిస్తోంది. ఈ సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడమే నిజమైన విశ్వగురువుకు న్యాయమనిపించుకుంటుంది’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో భారత్‌ మొదటి నుంచి తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచిస్తోంది. ఇది యుద్ధాల శకం కాదని, శాంతియుత పరిష్కారాలను అన్వేషించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో భారత్‌ అధ్యక్షతన జీ-20 దేశాధినేతల సమావేశం జరగనుంది. ఆ సదస్సులో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ మంత్రి భారత్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు