Supreme Court: అతీక్‌ను ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు?: యూపీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న

గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmad), అతడి సోదరుడు అష్రాఫ్‌ మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాల్పుల ఘటనపై యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు( Supreme Court) నివేదిక కోరింది.  

Published : 28 Apr 2023 17:12 IST

దిల్లీ: రాజకీయ నేతగా ఎదిగిన ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌లను జర్నలిస్టులుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల కాల్పిచంపారు. వైద్య పరీక్షలకు తరలిస్తోన్న తరుణంలో వారు హత్యకు గురయ్యారు. పోలీసు కస్టడీలో ఉన్న వారు ఈ విధంగా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దానిపై తాజాగా సుప్రీంకోర్టు( Supreme Court).. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. 

‘మేం ఈ ఘటనను టీవీలో చూశాం. అతీక్‌, అతడి సోదరుడిని ఆసుపత్రికి అంబులెన్స్‌లో ఎందుకు తరలించలేదు..? వారిని నడిపించుకుంటూ ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు..?’ అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై యూపీ ప్రభుత్వం కోర్టులో తన వాదన వినిపించింది. ‘కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఆ ఇద్దరు సోదరులను వైద్య పరీక్షలకు తీసుకెళ్లాం. ఈ విషయం మీడియాకు తెలిసింది. గత 30 సంవత్సరాలుగా అతీక్ కుటుంబంపై చాలా కేసులున్నాయి. అయితే ఇది దారుణమైన ఘటన. మేం హంతకులను అదుపులోకి తీసుకున్నాం. వారు పేరుకోసమే ఇదంతా చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆ హత్యలను టీవీలో చూశారు. ఆ హంతకులు జర్నలిస్టులుగా వచ్చి కాల్పులు జరిపారు. ఆ ఘటనపై విచారణకు ఓ కమిషన్‌ను ఏర్పాటుచేశాం’ అని వెల్లడించింది. ఇదిలా ఉంటే..అంతకుముందు స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ ఎన్‌కౌంటర్‌లో అతీక్‌ కుమారుడు అసద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కూడా సుప్రీం( Supreme Court) నివేదిక కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని