Supreme Court: ‘ఇప్పుడు చట్టాన్ని ఆపితే గందరగోళమే’.. ఈసీల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్తగా చేరిన ఇద్దరు ఈసీల నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Updated : 21 Mar 2024 13:24 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల  (election commissioners) నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ దశలో నిలిపివేస్తే అది తీవ్ర గందరగోళానికి, అనిశ్చితికి దారితీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే దీనిపై ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.

ఈ సందర్భంగా ఇటీవల ఈసీలుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్‌ అధికారులు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ నియామకాలను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. కొత్తగా నియమితులైన వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది. ‘‘ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ. అది పాలనాయంత్రాంగం కింద పనిచేస్తుందని చెప్పకూడదు. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేం. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యం’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. కొత్త చట్టం ప్రకారం ఇటీవల చేపట్టిన ఈసీ నియామకాలపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది.

ఇక, ఈసీల నియామకం కోసం సీజేఐతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ 2023లో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ఈ అంశంపై పార్లమెంట్‌ చట్టం చేసే వరకే తాత్కాలిక కమిటీ అమల్లో ఉంటుందని తాము గతంలోనే స్పష్టం చేశామని తెలిపింది. అయితే, కొట్ట చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను తాము పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. వీటిపై ఆరు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. 

సీజేఐను తప్పించడం సరైందే

2023 చట్టం రూపొందించక ముందు ఎన్నికల కమిషనర్ల నియామక తాత్కాలిక కమిటీలో ప్రధాని, సీజేఐ, లోక్‌సభలో విపక్షనేత సభ్యులుగా ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం ఏర్పడిన కమిటీలో సీజేఐ స్థానంలో కేంద్రమంత్రికి చోటు కల్పించారు. దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కేంద్రం బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. కొత్త చట్టంలో సీజేఐకు చోటు కల్పించకపోవడాన్ని సమర్థించుకుంది. కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న వాదన సరికాదని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని