Swati maliwal: అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయి: స్వాతి మాలీవాల్‌

యూట్యూబర్ ధ్రువ్ రాథీ తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఏకపక్ష పోస్టులు పెడుతున్నారని ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ ఆరోపించారు.

Updated : 26 May 2024 18:42 IST

దిల్లీ: ఆప్‌ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ఫ్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal) ఆరోపించారు. దీని వల్ల తనకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ ధ్రువ్ రాథీ (Dhruv Rathee) తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసినప్పటి నుంచి బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. 

“నా పార్టీకి చెందిన నాయకులు అసత్య ప్రచారాలు చేయడం వల్ల నాకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి. యూట్యూబర్‌  ధ్రువ్ రాథీ సోషల్‌ మీడియాలో నాకు వ్యతిరేకంగా పోస్టులు చేయడంతో అవి మరింత తీవ్రమయ్యాయి. స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకొనే అతడి లాంటి వ్యక్తులు ఆప్‌ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు. ప్రస్తుతం నేను అన్ని వైపుల నుంచి అసత్య ప్రచారాలు, తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్నాను’’ అని మాలీవాల్ ఆదివారం ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

తన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి పార్టీ నాయకత్వం ఈ విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె అన్నారు.  ధ్రువ్‌ను కలిసి తన వాదన వినిపిద్దామంటే.. అతడు తన ఫోన్‌ కాల్స్‌కు స్పందించట్లేదన్నారు. పార్టీ యంత్రాంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు మహిళల సమస్యలపై వారి వైఖరిని తెలియజేస్తుందన్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

మే 13న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)నివాసంలో మాలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సీఎం సహాయకుడు బిభవ్ కుమార్‌ను పోలీసులు మే 18న అరెస్టు చేశారు. కాగా అతడు శనివారం బెయిల్ కోరుతూ స్థానిక కోర్టును ఆశ్రయించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు