Swati Maliwal: కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ.. ఓ యూట్యూబర్‌పై ఫిర్యాదు

రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌ దిల్లీలోని హజారీ కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. తనపై ఆప్‌ ట్రోల్‌ ఆర్మీ తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోందని వాపోయారు. ఓ యూట్యూబర్‌ విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

Published : 27 May 2024 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలీవాల్‌(Swati Maliwal)పై దాడి కేసు విచారణ సందర్భంగా నేడు హజారీ కోర్టులో హైడ్రామా నడిచింది. ఒక దశలో మహిళా ఎంపీ కోర్టులో కన్నీరు పెట్టుకొన్నారు. అంతేకాదు.. ఓ యూట్యూబర్‌ కారణంగా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. 

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా అతడి లాయర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నివాసంలో సీసీ కెమెరాలు లేని ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే దాడి జరిగినట్లు మహిళా ఎంపీ చెబుతున్నారని ఆరోపించారు. అక్కడ రికార్డింగ్‌ సాధనాలు లేవన్న విషయం ఆమెకు తెలుసునన్నారు. మే 13న ఆమె సీఎం ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం అతిక్రమణే అని కోర్టుకు వెల్లడించారు. ఎంపీ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి ఇంట్లోకి ఆ రకంగా ప్రవేశించే అనుమతి ఇచ్చినట్లు కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె సమస్యలు సృష్టించారని చెప్పారు. ఈ ఆరోపణలను విన్న మాలీవాల్‌ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. 

ఇక తన వాదనలు వినిపించే సమయంలో ఆమె పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన నాటినుంచి భాజపా ఏజెంటని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన ట్రోల్‌ ఆర్మీ తనను వేధిస్తోందని పేర్కొన్నారు. వరుసగా ప్రెస్‌మీట్లు ఏర్పాటుచేసి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.  బిభవ్‌ కుమార్‌ సామాన్య వ్యక్తి కాదని గుర్తు చేశారు. గతంలో ఆప్‌ వాలంటీర్‌గా పనిచేసిన ఓ యూట్యూబర్‌ తనపై ఏకపక్షంగా ఓ వీడియో పోస్టు చేసిన నాటినుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. బిభవ్‌కుమార్‌కు బెయిల్‌ ఇస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు. 

ఇక మాలీవాల్‌ లాయర్‌ స్పందిస్తూ బిభవ్‌కుమార్‌ వాదన ప్రకారమే సీఎం నివాసంలోకి ఆమె చొరబడి ఉల్లంఘనలకు పాల్పడితే నాడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మరో వైపు దిల్లీ పోలీస్‌ కౌన్సిల్‌ కూడా మాలీవాల్‌ వాదనను బలపర్చేలా స్పందించింది. ‘‘ఆమెను కేజ్రీవాల్‌ అక్కడ (డ్రాయింగ్‌ రూమ్‌లో) వేచి ఉండాలని సూచించినప్పుడు.. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎలా అవుతుంది. బిభవ్‌ కుమారే ఉల్లంఘనలకు పాల్పడ్డారు’’ అని తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌ను రిజర్వులో పెట్టింది. 

యూట్యూబర్‌ ధ్రువ్‌రాథీ తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వీడియోలను పోస్టు చేసినప్పటినుంచీ  బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని స్వాతి ఆదివారం ఆరోపించారు. ‘‘స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకొనే ఇలాంటి వ్యక్తులు ఆప్‌ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు. ప్రస్తుతం నేను అన్నివైపుల నుంచి అసత్య ప్రచారాలు, తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్నా’’ అని ఆమె ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని