Bigg Boss: లైంగిక ఆరోపణలు వచ్చిన వ్యక్తి.. బిగ్‌బాస్ షోలోనా..?

మీటూ ఉద్యమ సమయంలో 10 మంది మహిళలు సాజిద్‌ ఖాన్‌పై లైంగిక ఆరోపణలు చేశారని దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్‌ అన్నారు. 

Published : 11 Oct 2022 01:19 IST

దిల్లీ: ఫిల్మ్‌ మేకర్ సాజిద్‌ ఖాన్‌ను బిగ్‌బాస్‌ షోలోకి తీసుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్‌ కూడా దీనిపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు లేఖ రాశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

దేశంలో మీటూ ఉద్యమం సమయంలో సాజిద్ ఖాన్‌పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. అవి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దాంతో 2018లో ఆయన్ను ఇండియన్ ఫిల్మ్‌ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌(ఐఎఫ్‌టీడీఏ) నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అలాగే ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రం డైరెక్టర్‌ బాధ్యతల నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన హిందీలో బిగ్‌బాస్‌-16 సీజన్‌లో పాల్గొంటున్నారు. దీనిని పలువురు వ్యతిరేకిస్తున్నారు.

ఈ వ్యవహారంపై తాజాగా మాలీవాల్‌ స్పందించారు. ‘మీటూ ఉద్యమ సమయంలో 10 మంది మహిళలు సాజిద్‌ ఖాన్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. ఆ ఫిర్యాదులు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఆయనకు బిగ్‌బాస్‌ షోలో స్థానం ఇచ్చారు. ఇది తప్పు. సాజిద్‌ను ఆ షో నుంచి తప్పించాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాశాను’ అని ఆమె ట్విటర్ వేదికగా వెల్లడించారు. అక్టోబర్ ఒకటిన బిగ్‌బాస్‌ మొదటి ఎపిసోడ్‌ ప్రారంభమైంది. దీనికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని