LS polls: లోక్‌సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?

ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు.

Published : 18 Apr 2024 19:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) తమిళనాడు సిద్ధమైంది. రాష్ట్రంలో (Tamil Nadu) ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని అడ్డుకోవాలని భావిస్తోన్న భాజపా.. మునుపెన్నడూ లేనివిధంగా విస్తృత ప్రచారం నిర్వహించింది. ఎలాగైనా ద్రవిడనాట పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ (Narendra Modi).. రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రధాని చేయనివిధంగా పలుమార్లు పర్యటించడం గమనార్హం. కొన్నేళ్లుగా ద్రవిడ పార్టీల పొత్తుతో నెట్టుకొస్తున్న కాషాయ పార్టీ.. ఈసారి సొంతగా బోణీ కొడుతుందా? లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

తొమ్మిదిసార్లు ప్రధాని పర్యటన

రాష్ట్రంలో జనవరి నుంచే ఎన్నికల వేడి కనిపించినప్పటికీ.. మార్చి నుంచి ప్రచార తీవ్రత పెరిగింది. ప్రధాన మంత్రి వరుస పర్యటనలు చేస్తూ డీఎంకే-కాంగ్రెస్‌ కూటమిపై తీవ్ర ఆరోపణలతో ముందుకెళ్లారు. చెన్నై, కోయంబత్తూర్‌, వెల్లూరు, తిరునెల్వేలి ప్రాంతాల్లో ప్రధాని ప్రచారం జోరుగా సాగింది. మొత్తంగా తొమ్మిదిసార్లు ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర పర్యటన చేయడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓ ప్రధాని ఇన్నిసార్లు పర్యటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

బోణీ కొట్టేనా..

1998 ఎన్నికల్లో కోయంబత్తూర్‌, నీలగిరి, తిరుచిరాపల్లి స్థానాల్లో భాజపా విజయం సాధించి రికార్డు సృష్టించింది. 2014 ఎన్నికల్లో కన్యాకుమారి నుంచి భాజపా సీనియర్‌ నేత పొన్‌ రాధాకృష్ణన్‌ గెలుపొందారు. 2019లో బోణీ కొట్టలేదు. ఇవి మినహా 25 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకేల పొత్తుతోనే నెట్టుకొస్తోంది. ఈసారి మాత్రం ప్రత్యేక కూటమితో బరిలోకి దిగింది. పీఎంకే, పుదియ నీది కట్చి, మాజీ సీఎం ఓ పన్నీర్‌ సెల్వం, టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని ఏఎంఎంకే, ఐజేకే పార్టీలతో కలిసి నడుస్తోంది. అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 5.5 శాతం ఓటు షేరు పొందిన భాజపా.. 2019లో 3.66 శాతానికి పడిపోయింది. ఈసారి మాత్రం ప్రధాని మోదీ విస్తృత ప్రచారం, అన్నామలై దూకుడుతో ఓట్ల శాతం మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కొత్త కూటమితో..

డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని చూస్తోన్న భాజపా.. ఊహించనివిధంగా ‘కచ్చతీవు’ అంశాన్ని తెరమీదకు తెచ్చింది.. డీఎంకే-కాంగ్రెస్‌ అవినీతి పార్టీలంటూ ప్రచారం చేసింది. దీనికి ప్రధాని మోదీ కూడా గొంతు కలపడంతో ఇది మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను కోయంబత్తూర్‌ నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపింది. ముమ్మర ప్రచారం చేసిన ఆయన.. రాష్ట్రంలో ‘ద్రవిడ పార్టీల’ అవసరం లేదన్నారు. ఈ రెండు పార్టీలతో పాటు తమిళ సెంటిమెంటుతో బరిలో దిగిన ‘నామ్‌ తమిళర్‌ కట్చి’ నుంచీ పోటీ ఉండటంతో కోయంబత్తూర్‌ స్థానంపై ఆసక్తి నెలకొంది.

భాజపా ఆరోపణలు.. స్టాలిన్‌ కౌంటర్‌

భాజపా ఆరోపణలను ఇండియా కూటమి తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. చైనా ఆక్రమణలపై మౌనంగా ఉంటోందంటూ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించింది. ఈ ఎన్నికలు రెండో స్వాతంత్ర్య సమరంగా పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్.. ఎలక్టోరల్‌ బాండ్లలో అవినీతి జరిగిందని ఆరోపించడంతోపాటు కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగించడం, రాజ్యాంగంలో మార్పులు చేస్తుందంటూ ఆరోపణలు చేశారు. స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి కూడా ప్రధానమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘29 పైసా మోదీ’ అంటూ పేర్కొన్న ఆయన.. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లే ప్రతీ రూపాయి నుంచి కేవలం 29 పైసలు మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తుందంటూ దుయ్యబట్టారు. ఇలా అగ్రనేతల విమర్శలు, ఆరోపణలతో గతంలో ఎన్నడూ చూడని ఎన్నికల వేడిని రగిల్చింది.

6.23 కోట్ల మంది ఓటర్లు..

రాష్ట్రంలో 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. మొత్తం 6.23 కోట్ల మంది ఓటర్లుండగా.. 950 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 68 వేల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. డీఎంకే నేత దయానిధి మారన్‌ (సెంట్రల్‌ చెన్నై), ఎ.రాజా (నీలగిరి), కనిమొళి (తూత్తుకుడి), భాజపా నుంచి ఎల్‌.మురుగన్‌ (నీలగిరి), తమిళసై సౌందరరాజన్‌ (సౌత్‌ చెన్నై), మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం (రామనాథపురం), కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరం (శివగంగా), అన్నాడీఎంకే నేత జె.జయవర్ధన్‌, ఏఎంఎంకే చీఫ్‌ టీటీవీ దినకరన్‌ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని