PM Modi: ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లకు బెదిరింపులు.. టీనేజర్‌ అరెస్టు

ప్రధాని మోదీ (PM Modi) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) లకు ప్రాణహాని తలపెడతానంటూ ఈ మెయిల్స్‌ పంపిన ఓ టీనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 07 Apr 2023 22:26 IST

నోయిడా: ప్రధాని మోదీ (PM Modi), ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi adityanath) లను హత్య చేస్తానని బెదిరిస్తూ మీడియా సంస్థలకు మెయిల్‌ పంపినట్లు భావిస్తున్న 16 ఏళ్ల ఓ టీనేజర్‌ను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌ (Bihar)కు చెందిన అతడిని లఖ్‌నవూ (Lucknow)లోని చిన్నహట్‌ ప్రాంతంలో పట్టుకున్నట్లు ఏసీపీ రాజ్‌నీష్‌వర్మ తెలిపారు.‘‘ ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 5న నోయిడా సెక్టార్‌ 20 పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాం. ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై మా సాంకేతిక బృందాలు ఆరా తీశాయి. దర్యాప్తులో భాగంగా నిందితుడు లఖ్‌నవూలోని చిన్నహట్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించాం. నిందితుడు 12వ తరగతి చదువుతున్నాడు.’’ అని వర్మ తెలిపారు.

నిందితుడిని జువైనల్‌ కోర్టులో హాజరు పరిచామని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ వర్మ అన్నారు. అంతకుముందు మీడియా సంస్థకు చెందిన కొందరు.. మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లకు ప్రాణహాని ఉందంటూ తమకు వచ్చిన ఈమెయిల్‌పై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి పేరిట ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేట్టారు. రెండు రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేసి జువైనల్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలను కూడా ఉపయోగించుకున్నట్లు ఏసీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని