Tej Pratap Yadav: ప్రాణ భయం ఉంది.. భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్ యాదవ్

Eenadu icon
By National News Team Updated : 02 Nov 2025 13:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పట్నా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Polls) జరగనున్న బిహార్‌లో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, దాడులపై ‘జనశక్తి జనతా దళ్‌’ (జేజేడీ) చీఫ్‌ తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ముప్పు పొంచి ఉందని.. భద్రతను మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇటీవల దుండగుల కాల్పుల్లో.. మొకామా నియోజకవర్గ జన్‌సురాజ్‌ పార్టీ అభ్యర్థి పీయూష్‌ ప్రియదర్శి మామ, పార్టీ కార్యకర్త అయిన దులార్‌ చంద్‌ మరణించారు. ఈ విషయాన్ని తేజ్‌ ప్రతాప్‌ ప్రస్తావిస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ నాయకులే లక్ష్యంగా దాడులు, హత్యాయత్నాలు తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ శత్రుత్వం కారణంగా తనను కూడా లక్ష్యం చేసుకునే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణ భయం ఉన్నందున భద్రతను మరింత పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అప్పుడే తాను ఎలాంటి భయం లేకుండా ప్రచారంలో పాల్గొనగలుగుతానని అన్నారు. 

సొంత పార్టీ నేతపై ఈసీకి ఫిర్యాదు..

తమ పార్టీ తరఫున సుపాల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిపై తేజ్‌ ప్రతాప్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తమ అభ్యర్థి మహాగఠ్‌బంధన్ అభ్యర్థి నుంచి మద్దతు కోరారని.. ఇది పార్టీ విధానాలకు విరుద్ధమన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేసి.. తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap Yadav)ను మే 25న పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. తమ కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా చేస్తున్న చర్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం తేజ్‌ ప్రతాప్ యాదవ్‌ ‘జనశక్తి జనతా దళ్‌’ పేరిట పార్టీని స్థాపించారు. బ్లాక్‌ బోర్డును పార్టీ గుర్తుగా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న బిహార్‌ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులను కూడా నిలిపారు. వైశాలి జిల్లాలో ఉన్న మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తేజ్‌ ప్రతాప్‌ బరిలో ఉన్నారు.

Tags :
Published : 02 Nov 2025 13:14 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని