Tejashwi Yadav: ఆసుపత్రిలో భార్య.. సీబీఐ విచారణకు రాలేనన్న తేజస్వీ

రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో నేడు విచారణకు రావాలంటూ తేజస్వీ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే తన భార్య అనారోగ్యం దృష్ట్యా తాను రాలేనని ఆయన చెప్పినట్లు సమాచారం.

Published : 11 Mar 2023 14:01 IST

దిల్లీ: రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసు (Land for jobs Case)లో దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav)కు చెందిన నివాసంలో ఈడీ (ED) నిన్న సోదాలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ (CBI) శనివారం ఆయనకు సమన్లు జారీ చేసింది. అయితే, నేడు తాను హాజరుకాలేనని తేజస్వీ చెప్పినట్లు తెలుస్తోంది. గర్భిణీ అయిన తన భార్య ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న కారణంగా విచారణకు రాలేనని సీబీఐకి ఆయన సమాచారమిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

రైల్వే ఉద్యోగాల కుంభకోణం (Land for jobs Case)లో ఆ శాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్‌ (Lalu Prasad Yadav) బంధువులు, ఆర్జేడీ (RJD) నేతల ఇళ్లు, ప్రాంగణాల్లో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. దక్షిణ దిల్లీలో తేజస్వీ యాదవ్‌ బసచేసిన ఒక నివాసంలోనూ ఈ సోదాలు జరిగాయి. ఆ తనిఖీల్లో భాగంగా గర్భిణీ అయిన తేజస్వీ భార్యను 15 గంటల పాటు ప్రశ్నల పేరుతో వేధించినట్లు ఆర్జేడీ ఆరోపించింది. దీంతో ఆమె రక్తపోటు పెరిగి అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొంది. ఈ సమయంలో తేజస్వీ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేయడంతో ఆయన రాలేనని చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను భార్య పక్కన ఉండాల్సిన అవసరం దృష్ట్యా.. విచారణకు హాజరుకాలేనని తేజస్వీ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ కేసులో మార్చి 4వ తేదీనే విచారణకు రావాలని సీబీఐ.. తేజస్వీకి సమన్లు ఇచ్చింది. అయితే, కొన్ని కారణాల రీత్యా ఆయన అప్పుడు హాజరుకాకపోవడంతో.. శనివారం మళ్లీ సమన్లు జారీ చేశారు.

2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో ‘గ్రూప్‌-డి’ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. నాడు ఉద్యోగాలు పొందినవారు లాలూ, అతని కుటుంబసభ్యులకు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్‌ సంస్థకు భూములను (Land for jobs Case) లంచంగా ఇచ్చారని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి లాలూను, ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ఇటీవల ప్రశ్నించింది. ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ.. శుక్రవారం దిల్లీ, బిహార్‌, ముంబయిలో మొత్తం 25 చోట్ల సోదాలు చేపట్టింది. తేజస్వీ నివాసంతో పాటు లాలూ కుమార్తెలు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని