Caste Censu: కుల గణనకు కేంద్రం ఓకే.. ప్రధానికి లేఖ రాసిన తేజస్వీ యాదవ్‌

Eenadu icon
By National News Team Published : 03 May 2025 12:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పట్నా: వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణనను (Caste Census) చేర్చుతామని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాశారు. ఇది మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పును తీసుకొచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు. కులగణన కేవలం డేటా కాదని, అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని.. ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు. కులగణన నిర్వహించిన అనంతరం ఆ డేటాను వ్యవస్థాగత సంస్కరణలు చేయడానికి ఉపయోగిస్తారా లేదా మునుపటి కమిషన్‌ల నివేదికల మాదిరిగానే ఉంచేస్తారా అని ప్రధానిని ప్రశ్నించారు.

జనాభా లెక్కలు, కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిహార్‌ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నోఏళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న కులగణన డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోకుండా.. దేశ ప్రజల్లో విభజనలు చేయడం సరైన చర్య కాదని పేర్కొందన్నారు. బిహార్ కుల సర్వే చేపట్టినప్పుడు కూడా పదేపదే దానిని అడ్డుకుందని గుర్తు చేశారు. ఆలస్యంగా అయినా కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనివల్ల సమాజంలో చాలాకాలంగా అణచివేతకు గురవుతున్న ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. జనాభా గణన డేటా సామాజిక రక్షణ, రిజర్వేషన్ విధానాల సమగ్ర సమీక్షకు ఉపయోగపడేలా ఉండాలని తేజస్వీ అన్నారు. అదేవిధంగా రిజర్వేషన్లపై ఉన్న ఏకపక్ష పరిమితిని కూడా పునఃపరిశీలించాలని కేంద్రాన్ని కోరారు.

జనాభా లెక్కల్లోనే దేశంలో కులగణనను (Caste Census) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని