Reasi: ఉగ్ర వేట ముమ్మరం

జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఆదివారం దాడి చేసిన ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు వేట ముమ్మరం చేశాయి.

Published : 11 Jun 2024 05:54 IST

రాజౌరీ, రియాసీల్లో   కొనసాగుతున్న గాలింపు 
యాత్రికుల బస్సుపై దాడి లష్కరే పనేనని అంచనా 

రియాసీలో భద్రతాదళాల పహరా

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఆదివారం దాడి చేసిన ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు వేట ముమ్మరం చేశాయి. సైన్యం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా ఈ కూంబింగ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తించే లష్కర్‌-ఎ-తయిబా ఉగ్ర సంస్థకు చెందిన ముగ్గురు లేదా నలుగురు విదేశీ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని బలగాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. రాజౌరీ, రియాసీల్లోని పర్వత ప్రాంతాల్లో వారు దాక్కొని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. దాడిలో గాయపడ్డవారి వాంగ్మూలాలను అధికారులు సోమవారం నమోదు చేసుకున్నారు. రియాసీలో దాడి తమ పనేనని లష్కర్‌-ఎ-తయిబా అనుబంధ ముష్కర మూక ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ తొలుత ప్రకటించింది. తర్వాత ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, దిల్లీకి చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై రియాసీలో ఉగ్రవాదులు ఆదివారం కాల్పులకు తెగబడ్డారు. అనంతరం బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాతపడ్డారు. 41 మంది గాయపడ్డారు. 

మృతుల్లో రెండేళ్ల బాలుడు 

రియాసీ ఘటన మృతుల్లో రాజస్థాన్‌కు చెందినవారు నలుగురు ఉన్నారు. వారిలో రాజేంద్ర సైనీ (42), ఆయన భార్య మమత (40), వారి బంధువు పూజా సైనీ (30), ఆమె రెండేళ్ల కుమారుడు టిటు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు ఉత్తర్‌ప్రదేశ్‌వాసులు. మరో ఇద్దరు (బస్సు డ్రైవరు, కండక్టరు) రియాసీకి చెందినవారే. చనిపోయినవారిలో ఐదుగురికి, గాయపడ్డవారిలో పది మందికి తూటా గాయాలున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. దాడికి సంబంధించి తాజా పరిస్థితులను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు అధికారులు నివేదించారు. 

పాక్‌ వ్యతిరేక నిరసనలు 

రియాసీ దాడి నేపథ్యంలో జమ్మూ ప్రాంతమంతటా సోమవారం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఉగ్ర మూకలపై, పాక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


చనిపోయినట్లు నటించి.. ప్రాణాలు కాపాడుకొని.. 

రియాసీ ఘటనలో ప్రాణాలతో బయటపడిన పలువురు బాధితులు దాడి తాలూకు భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. తాము చనిపోయినట్లు నటించి, ప్రాణాలు కాపాడుకున్నామని పేర్కొన్నారు. ‘‘ముఖాలకు మాస్కులు పెట్టుకొని ఉన్న కొందరు ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. బస్సు లోయలో పడగానే అటుగా వచ్చి తూటాల వర్షాన్ని కొనసాగించారు. ఆ సమయంలో మేం చనిపోయినట్లు నటించాం. 10-15 నిమిషాల తర్వాత స్థానికులు, పోలీసులు వచ్చి మమ్మల్ని కాపాడారు’’ అంటూ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని