Terror Attack: యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. యాత్రికులతో వెళుతున్న ఒక బస్సుపై ఆదివారం సాయంత్రం కాల్పులకు దిగారు. దీంతో ఆ వాహనం అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో పడిపోయింది.

Updated : 10 Jun 2024 06:46 IST

అదుపుతప్పి లోయలో పడ్డ వాహనం.. 9 మంది మృతి
33 మందికి గాయాలు 
జమ్మూకశ్మీర్‌లో ఘాతుకం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. యాత్రికులతో వెళుతున్న ఒక బస్సుపై ఆదివారం సాయంత్రం కాల్పులకు దిగారు. దీంతో ఆ వాహనం అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా.. 33 మంది గాయపడ్డారు. రియాసీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 

53 సీట్లున్న ఈ బస్సు శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళుతోంది. తెర్యాత్‌ గ్రామం వద్ద ఈ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో వాహనంపై అతడు నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. 9 మృతదేహాలను వెలికితీసినట్లు రియాసీ జిల్లా సీనియర్‌ ఎస్పీ మోహితా శర్మ తెలిపారు. గాయపడినవారిని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులని భావిస్తున్నారు. 

ముష్కరులు 25 నుంచి 30 తూటాలను పేల్చారని బాధితులు తెలిపారు. ఎరుపు రంగు మఫ్లర్‌ ధరించిన ఒక ఉగ్రవాది కాల్పులు జరపడాన్ని చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. తాము సాయంత్రం 4 గంటలకే తిరుగుప్రయాణం కావాల్సిందని, కానీ 5.30 గంటలకు వాహనం శివఖోరి ఆలయ ప్రాంతం నుంచి బయల్దేరిందని, ఆ వెంటనే ఈ ఘటన జరిగిందని వివరించారు.  ఈ దాడికి తెగబడ్డ ముష్కరులను పట్టుకోవడానికి సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలు వేట ప్రారంభించాయి. పొరుగునున్న రాజౌరీ, పూంచ్‌లతో పోలిస్తే రియాసీ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ. అలాంటి ప్రదేశంలో ఈ ఘటన జరగడం గమనార్హం. 

వదిలేది లేదు: అమిత్‌ షా 

యాత్రికులపై దాడి బాధాకరమని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు. దీనికి బాధ్యులైన వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు. బాధితులకు వైద్య సాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. 

మరోవైపు ముష్కర దాడిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరుతున్న తరుణంలో, పలువురు దేశాధినేతలు మన దేశంలో ఉన్న సమయంలోనే ఈ దారుణం జరిగిందన్నారు. జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించామని మోదీ సర్కారు జబ్బలు చరుచుకుంటోందని, ఇలాంటి ఘటనలు.. ఆ ప్రకటనల్లోని డొల్లతనాన్ని చాటుతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా ఈ దాడిని ఖండించారు. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఉగ్రవాద ముఠాలతో పొంచి ఉన్న ముప్పునకు ఈ ఘటన అద్దంపడుతోందని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని