Terror Attack: ఆ ఫోన్‌ ఇక మోగదు.. ఆ పసికందు కోసం తండ్రెప్పటికీ రారు..!

Terror Attack: కశ్మీర్లో(Jammu and Kashmir) ఉగ్రవాదులు భద్రతాదళాలపై కాల్పులకు తెగబడటంతో ముగ్గురు అధికారులు అమరులయ్యారు. అయినప్పటికీ ముష్కరులను మట్టుపెట్టే చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.

Updated : 14 Sep 2023 14:54 IST

కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ముగ్గురు యోధులదీ ఒక్కో కన్నీటి గాథ. కొద్దిసేపు ఆగి చేస్తానన్న ఫోన్‌ ఇంకెప్పటికీ మోగదని ఆ క్షణం కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ కుటుంబానికి తెలీదు.. తన రెండేళ్ల కుమార్తెను చూసేందుకు మేజర్ ఆశిష్‌ ధొనక్‌ ఇంకెప్పటికీ ఇంటికి వెళ్లరు.. డీఎస్పీ హుమయూన్‌ భట్ రెండు నెలల కుమార్తెకు తండ్రి లాలన ఎప్పటికీ లభించదు. బుధవారం కశ్మీర్‌లో(Jammu and Kashmir) జరిగిన ఉగ్రఘాతుకం ఈ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ( Terror Attack)

శ్రీనగర్‌: అనంతనాగ్‌(Anantnag) జిల్లాలోని కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో దాక్కున్న ముష్కరులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఆర్మీ కర్నల్‌, మేజర్‌, డీఎస్పీ ప్రాణత్యాగం చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి గడోల్‌ ప్రాంతంలో భద్రతాదళ సిబ్బంది ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు. బుధవారం ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు నక్కి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి దాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగలడంతో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మేజర్‌ ఆశిష్‌ ధొనక్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్‌ భట్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పరిస్థితి విషమించి వారు తుదిశ్వాస విడిచారు. మరో జవాను ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

అదే చివరి ఫోన్‌కాల్‌..

బుధవారం ఉదయం 6.45 గంటలకు కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్(41)(Colonel Manpreet Singh) తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఉగ్ర ఆపరేషన్‌లో ఉండటంతో తర్వాత మళ్లీ చేస్తానని చెప్పారు. కానీ, అతడి కుటుంబీకులకు అప్పుడు తెలీదు.. అదే చివరి ఫోన్ కాల్‌ అవుతుందని..! ‘ఆయన నిబద్ధత కలిగినవ్యక్తి. గత ఏడాది ఆయన సేన మెడల్ అందుకున్నారు’ అని బావమరిది వీరేందర్‌ సింగ్‌ వాపోయారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్‌కు మన్‌ప్రీత్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆయన భార్య జగ్మీత్ టీచర్. సింగ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. జగ్మీత్‌కు తన భర్త గాయపడ్డారని మాత్రమే చెప్పారట. ఆయన మరణవార్త గురించి తెలియదని వీరేందర్ భావోద్వేగానికి గురయ్యారు.

తెలుగు విద్యార్థిని మృతి కేసులో అమెరికా పోలీసుల తీరుపై స్పందించిన భారత్‌.. దర్యాప్తునకు డిమాండ్‌..!

మేజర్‌ ఆశిష్‌ ధొనక్‌(34)(Major Ashish Dhonack)కు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన కుటుంబం హరియాణాలోని పానిపట్‌లో నివసిస్తోంది. ‘నెలన్నర క్రితం ఇంటికి వచ్చారు. అక్టోబర్‌లో ఇంటికి రావాల్సి ఉండగా.. ఇంతలో ఇలా జరిగింది’ అని మేజర్ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఒడిలో పసిబిడ్డతో.. భర్తకు కన్నీటి వీడ్కోలు..

హుమయూన్ భట్.. జమ్మూకశ్మీర్ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌(Deputy Superintendent Himayun Bhat)గా ఉన్నారు. ఆయన తండ్రి రిటైర్డ్‌ ఇన్‌స్పెక్టర్ జనరల్‌. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనకు రక్త స్రావం ఎక్కువగా కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు గతేడాదే వివాహం కాగా.. రెండు నెలల క్రితమే ఆయన తండ్రయ్యారు. కుమార్తె పుట్టిన ఆనందంలో ఉన్న ఆ కుటుంబంలో ఈ ఘటన విషాదాన్ని నింపింది. భట్‌ సొంత గ్రామం బుడ్గామ్‌లో భౌతికకాయానికి నివాళులు అర్పించే సమయంలో.. ఆయన భార్య తన రెండు నెలల కుమార్తెను ఒడిలో పెట్టుకొని దీనంగా కూర్చున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆయన తండ్రి కడసారి వీడ్కోలు పలుకుతోన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు.. 

ఇదిలా ఉంటే.. కొకెర్‌నాగ్ ప్రాంతంలో ఇప్పటికీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని కశ్మీర్ జోన్‌ పోలీసు విభాగం ప్రకటించింది. ఆ ఇద్దరిలో ఒకరు ఉజైర్‌ అహ్మద్ ఖాన్(28) ఉన్నట్లు తెలిపింది. ఉజైర్‌ అనంత్‌నాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు 26 జులై 2022 నుంచి ఆచూకీ లేడు. ప్రస్తుతం ఉజైర్ వెంట ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

లష్కరే తొయిబాకు చెందిన నిషేధిత ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటించుకుంది. సెప్టెంబర్‌ 8న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో తమ నేత రియాజ్‌ అహ్మద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి ఒడిగట్టినట్లు ప్రకటించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని