తెలుగు విద్యార్థిని మృతి కేసులో అమెరికా పోలీసుల తీరుపై స్పందించిన భారత్‌.. దర్యాప్తునకు డిమాండ్‌..!

అమెరికా(USA)లో తెలుగు విద్యార్థిని(Andhra Student's Death) మృతి కేసులో అక్కడి పోలీసు అధికారి ఒకరు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. దీనిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలని కోరింది. 

Updated : 14 Sep 2023 13:52 IST

దిల్లీ: అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని(Andhra Student's Death) మృతి చెందిన ఘటనలో సియాటిల్ నగరానికి చెందిన పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియోపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలపై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం(Indian consulate in San Francisco) ట్వీట్ చేసింది. 

‘జాహ్నవి కందుల మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. సియాటిల్‌ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశాం. అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం’ అని దౌత్యకార్యాలయం వెల్లడించింది. 

కేరళలో నిఫా వైరస్‌ ‘బంగ్లాదేశ్‌’ వేరియంట్‌

కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి(23) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. ఉన్నత చదువుల నిమిత్తం 2021లో అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23న కళాశాలకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సియాటిల్‌ నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆ మాటలన్నీ అతడి శరీరానికి అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. అవి తాజాగా వెలుగులోకి రావడంతో ఆయన తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

స్పందించిన అమెరికా..

భారత్‌ అభ్యర్థనపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. జాహ్నవి మృతి కేసులో త్వరితగతిన పారదర్శక విచారణ జరుపుతామని వెల్లడించింది. మరోవైపు యూఎస్ చట్టసభ సభ్యులు, ప్రవాస భారతీయులు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ప్రాణాలకు విలువలేదని భావించేవారు దర్యాప్తు సంస్థల్లో పనిచేయకూడదని ఇండియన్‌ అమెరికన్ చట్టసభ సభ్యుడు రో ఖన్నా మండిపడ్డారు. ఆ వీడియో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మరో ప్రవాస భారతీయ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని