Atiq Ahmad: 18 ఏళ్ల వయస్సులో హత్య కేసు.. గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయవేత్తగా..!

గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌ (Atiq Ahmad) 18 ఏళ్ల వయస్సులోనే తొలి హత్య కేసులో ప్రధాన నిందితుడు.గ్యాంగ్‌స్టర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించిన అతిక్‌.. అనతికాలంలోనే రాజకీయాల్లోనూ కీలక నేతగా ఎదిగి..చివరికి నడిరోడ్డుపై హత్యకు గురయ్యారు.

Updated : 16 Apr 2023 20:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌ (60) (Atiq ahmad)ను కొందరు వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఒకప్పుడు తన కండబలంతో అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అతిక్‌ను నడిరోడ్డుపై మట్టుపెట్టడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రత్యేకించి ప్రయాగ్‌రాజ్‌లో అతడి పేరు చెబితే అధికారులకు చెమటలు పట్టాల్సిందే. 18 ఏళ్ల వయస్సులోనే తొలిసారి హత్యకేసులో నిందితుడిగా ఉన్న అతిక్‌.. ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా, రాజకీయనాయకుడిగా ఎదిగిపోయారు.

భూ కబ్జాలకు బాస్‌

సరిగ్గా 44 ఏళ్ల క్రితం 1979లో ఓ హత్య కేసులో అతిక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు. అప్పటి వరకు చిన్నచిన్న సెటిల్‌మెంట్లు, భూకబ్జాలతో సరిపెట్టుకున్న అతిక్‌ 1990 నుంచి 2000 మధ్య కాలంలో ఎవరూ ఊహించని విధంగా ఎదిగిపోయారు. ఆ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు రద్దయిపోయి.. పలుమార్లు రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో అతిక్‌ అహ్మద్‌ పేట్రేగిపోయారు. ప్రయాగ్‌రాజ్‌ మాత్రమే కాకుండా తూర్పు యూపీలోని ఇతర ప్రాంతాల్లోనూ దోపిడీలు, భూకబ్జాలకు పాల్పడ్డారు. తన అనుచరులతో అధికారులను బెదిరించి ప్రభుత్వ భూములను కాజేసేవారు. ఇలా అనతి కాలంలోనే భూకబ్జా సిండికేట్‌కు అతిక్‌ బాస్‌గా మారిపోయారు.

స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది..

ఎదురులేని గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన అతిక్‌ అహ్మద్‌కు రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కలిగింది. 1989లో అలహాబాద్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అతిక్‌.. ఆ తర్వాత అదే స్థానం నుంచి ఎస్పీ, అప్నాదళ్‌ టికెట్లపై విజయం సాధించారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫుల్పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004లో తొలిసారిగా బరిలో నిలిచి విజయం సాధించారు.

రాజుపాల్‌ హత్యతో..

గ్యాంగ్‌స్టర్‌గా, తిరుగులేని నేతగా ఎదిగిన అతిక్‌ అహ్మద్‌ పరిస్థితులు 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యతో తారుమారయ్యాయి. ఈ హత్య కేసులో అతిక్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత 2006లో రాజ్‌పాల్‌ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ను కిడ్నాప్‌ చేసిన కేసులు అతిక్‌పై ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా అతిక్‌ను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలకు తరలిస్తుండగా కాల్పులు జరిగాయి. 

పార్టీ నుంచి బహిష్కరణ

అతిక్‌పై ఆరోపణలు ఎక్కువవుతుండటంతో  2008లో సమాజ్‌వాదీ పార్టీ అతడిని బహిష్కరించింది. ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో అతడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతిక్‌.. ఏ కేసులోనూ దోషిగా తేలకపోవడంతో 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం కలిగింది. కానీ, పరాజయం పాలయ్యారు. ఓ దాడి కేసుకు సంబంధించి 2017లో అతిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైలులో ఉన్న సమయంలోనూ కిడ్నాప్‌లు, దాడులను ప్రోత్సహిస్తున్నాడన్న కారణంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2019లో అతడిని అహ్మదాబాద్‌లోని సబర్మతి కారాగారానికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే శిక్ష అనుభవిస్తున్నారు.

మరోవైపు అతిక్‌పై ఇప్పటి వరకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయి. అతిక్‌ ముఠాలో దాదాపు 144 మంది సభ్యులు ఉన్నారని యూపీ మంత్రి రాజేశ్వర్‌ సింగ్‌ చెబుతున్నారు. మరోవైపు అతడికి భయపడి 10 మంది హైకోర్టు న్యాయమూర్తులు కేసులు వినకుండానే వెళ్లిపోయారని ఆయన అన్నారు. అతిక్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.11 వేల కోట్లకు పైగానే ఉంటుందని ఆయన తెలిపారు.

లక్షలాదిమందిని భయపెట్టి అనామకుల చేతిలో హతమైన అతిక్‌ నేరాల్లో ఆరితేరాడు. తన తరువాత నేరసామ్రాజ్య పగ్గాలను మూడో కుమారుడు అసద్‌కు అప్పగించాలనుకున్నాడు.అయితే  ఉమేష్‌పై కాల్పులు జరపడంతో అసద్‌ పోలీసుల కంట్లో పడ్డాడు. చివరకు ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. దీంతో అతిక్‌ కళ్లముందే తాను నిర్మించిన అండర్‌వరల్డ్‌ కుప్పకూలిపోయింది. పెద్దకుమారులు ఇద్దరు జైల్లో ఉండగా మైనర్లైన మరో ఇద్దరు కుమారులు జువైనల్‌ హోంలో ఉన్నారు. భార్య పరారీలో ఉంది. అసద్‌ చనిపోయాడు. చివరకు ముగ్గురు అనామక యువకుల కాల్పుల్లో అతిక్‌తో పాటు అతని సోదరుడు హతమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని