Atiq Ahmad: సన్నీపై గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ఎఫెక్ట్‌.. మిగతా ఇద్దరిని ఒప్పించి అతీక్‌ హత్య..!

సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్‌ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సన్నీసింగ్‌ పగటి కలలే ఈ కాల్పుల ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 

Updated : 18 Apr 2023 15:08 IST

ప్రయాగ్‌రాజ్‌: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జర్నలిస్టుల్లా వచ్చిన సన్నీ సింగ్‌, లవ్లేశ్‌, అరుణ్ మౌర్యలు ఈ హత్యలకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జంట హత్యల్లో ప్రధాన సూత్రధారుడు సన్నీసింగ్‌( Sunny Singh) అని తెలుస్తోంది. అతడే మిగతా ఇద్దరిని ఒప్పించి, ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.  

అతీక్‌ను హత్యచేసి పేరు సంపాదించాలనే లక్ష్యంతోనే కాల్పులు జరిపామని గతంలో నిందితులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ప్రధాన సూత్రధారిగా సన్నీసింగ్‌(Sunny Singh)ను భావిస్తున్నారు. అతీక్‌, అతడి సోదరుడిపై కాల్పులు జరిపేందుకు మిగతా ఇద్దరిని అతడే ఒప్పించినట్లు తెలుస్తోంది. అలాగే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ ప్రభావం అతడిపై ఉందట. లారెన్స్‌ వీడియోలు వీక్షించే అతీక్ హత్యకు ప్రణాళిక రచించినట్లు విచారణలో భాగంగా తెలుస్తోంది. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య వెనక లారెన్స్ గ్యాంగ్‌ ఉందన్న వార్తలు విన్న సన్నీ.. ఆ తరహాలో ఓ పెద్దవ్యక్తిని హత్య చేసి పాపులర్‌ కావాలని కలలుకన్నట్లు సమాచారం. లవ్లేశ్‌, అరుణ్‌తో పోల్చుకుంటే సన్నీ ప్రమాదకారుడని, అతడిపై 10కిపైగా కేసులు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. 

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌ పాల్‌ (Umesh Pal) హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను జైలు నుంచి మెడికల్ చెకప్‌కు తీసుకెళ్తుండగా వారిపై ఆకస్మికంగా కాల్పులు జరిగాయి. దాంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం నిందితులను ప్రయాగ్‌రాజ్‌ కేంద్ర కారాగారం నుంచి ప్రతాప్‌గఢ్‌ జిల్లా జైలుకు తరలించారు. పరిపాలనాపరమైన కారణాలతో తరలించామని పోలీసులు చెబుతున్నా.. అతీక్‌ కుమారుడు అలీ ప్రయాగ్‌రాజ్‌ జైలులోనే ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే. అత్యవసరం కాకున్నా అతీక్‌, అతడి సోదరుడిని రాత్రి 10 గంటల సమయంలో వైద్య పరీక్షలకు తరలించడంలోని ఆంతర్యమేంటని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని