Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు

Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది.

Updated : 18 Apr 2024 17:46 IST

దిల్లీ: ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఈవీఎం (EVM) ఓట్లతో వీవీప్యాట్‌ (VVPAT) స్లిప్‌లను క్రాస్‌ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి ఆరా తీసిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలని వ్యాఖ్యానించింది. 

ఈ పిటిషన్‌పై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఇటీవల కేరళలో జరిగిన మాక్‌ పోల్‌ గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘కాసర్‌గోడ్‌లో మాక్‌ ఓటింగ్‌ జరిగింది. అక్కడ నాలుగు ఈవీఎంలను వీవీప్యాట్లతో సరిపోలిస్తే భాజపాకు అదనంగా ఓట్లు వచ్చాయి’’ అని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్‌

‘‘ఇది ఎన్నికల ప్రక్రియ. ఇందులో పవిత్రత అవసరం. అనుకున్న విధంగా జరగడం లేదని ఎవరూ ఆందోళనలకు గురి కాకుండా చూసుకోవాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల సంఘం తమ ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది. ప్రస్తుతం దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై గత మంగళవారం కూడా కోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రహస్య బ్యాలెట్‌ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్‌ (Voting) ప్రక్రియను పోల్చి తక్కువ చేయొద్దని సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని