Delhi: యూపీ పవర్‌గ్రిడ్‌లో అగ్నిప్రమాదం.. దిల్లీకి కరెంట్‌ కష్టాలు

దిల్లీ (Delhi) ప్రజల నెత్తిన మరో పిడుగు పడింది. ఇప్పటికే హీట్‌వేవ్‌, నీటి సంక్షోభంతో అల్లాడుతోన్న ప్రజలు కరెంట్‌ కోతలతో ఇబ్బందిపడుతున్నారు. 

Published : 11 Jun 2024 17:30 IST

దిల్లీ: హీట్‌వేవ్, నీటి సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న దేశ రాజధాని దిల్లీ(Delhi)పై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీగా కరెంట్‌ కోతలను ఎదుర్కొంటోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మండోలాలోని పవర్‌ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో దిల్లీ వాసులకు ఈ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరానికి ఈ గ్రిడ్‌ నుంచి 1500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది. ఈ అగ్ని ప్రమాదం గురించి దిల్లీ మంత్రి ఆతిశీ వెల్లడించారు.

‘‘మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి దిల్లీలోని పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఉన్నాయి. దేశంలో విద్యుత్ సరఫరా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంది కాబట్టి.. విద్యుత్ శాఖ కొత్త మంత్రి అపాయింట్‌మెంట్‌ కోరతాను. జాతీయ స్థాయిలో ఇలా ఒక గ్రిడ్‌ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ గరిష్ఠ వినియోగం 8000 మెగా వాట్లకు చేరుకున్న సమయంలో కూడా పవర్‌కట్‌ లేదు. జాతీయస్థాయిలో మౌలిక సదుపాయాల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది’’ అని కేంద్రాన్ని విమర్శించారు.

పలు అంశాలపై కేంద్రం నియమించిన దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్‌ ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. ఇటీవలే నీటి సంక్షోభంపై రెండువర్గాలు విమర్శలు చేసుకున్నాయి. దిల్లీ ప్రజలపై హరియాణా(Haryana) ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమ్‌ఆద్మీ పార్టీ(APP) నేత ఆతిశీ(Atishi) ఆరోపించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే నీరు విడుదలను తగ్గించిందన్నారు. నగరం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో రాజకీయాలు చేయకూడదని, మిగులు జలాలను సరఫరా చేయాలని సుప్రీంకోర్టు హరియాణాను ఆదేశించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని