Thief: 1000 కేసులు.. 90సార్లు జైలుకెళ్లి.. ఆ ‘గజదొంగ’ మృతి!

ఫ్యాన్సీ కార్లను తస్కరించడం మొదలు న్యాయమూర్తిగా అవతారమెత్తి వందల మంది నిందితులకు బెయిల్‌ ఇచ్చిన ఓ గజదొంగ (85) మృతి చెందాడు.

Published : 21 Apr 2024 21:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతడో చోరుడు. సాదాసీదా దొంగ కాదు.. ఆహ్లాదం కోసం ఫ్యాన్సీ కార్లను తస్కరించడం మొదలు న్యాయమూర్తిగా అవతారమెత్తి వందల మంది నిందితులకు బెయిల్‌ ఇచ్చిన ఘనుడు. దశాబ్దాల నేర చరిత్ర కలిగిన ఈయన.. 90 సార్లు కటకటాల వెనక్కి వెళ్లి రావడం గమనార్హం. 85ఏళ్ల వయసున్న ఈ గజదొంగ.. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దిల్లీకి చెందిన ధని రామ్‌ మిత్తల్‌ ఉన్నత విద్య అభ్యసించాడు. రోహ్తక్‌లో బీఎస్‌సీ ఫస్ట్‌ క్లాస్‌లో పాసైన అతడు ఎల్‌ఎల్‌బీ చేసేందుకు రాజస్థాన్‌ వెళ్లాడు. న్యాయశాస్త్రం పూర్తైన తర్వాత పలువురు న్యాయవాదుల వద్ద గుమస్తాగా పనిచేశాడు. ఆ సమయంలోనే ఆనందం కోసం కార్లను తస్కరించడం మొదలుపెట్టాడు. 1964లో తొలిసారి చీటింగ్‌కు పాల్పడ్డ అతడు.. ఫోర్జరీ చేసి స్టేషన్‌ మాస్టారుగా ఉద్యోగం సంపాదించాడు. 1968 నుంచి 1974 వరకు అక్కడ పనిచేశాడు.

ఎన్నిసార్లు పట్టుబడినా తీరు మార్చుకోని మిత్తల్‌.. 60 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతూనే ఉన్నాడు. జీవిత కాలంలో చోరీలు, చీటింగ్‌, వేషధారణ మార్చడం, ఫోర్జరీ వంటి దాదాపు 1000పైగా నేరాలకు పాల్పడినట్లు అంచనా. ఇతడి నేర చరిత్రను ఇటీవల తిరగేసిన పోలీసులకు.. గతంలో న్యాయమూర్తిగా అవతారమెత్తి వందల మంది విచారణ ఖైదీలకు బెయిల్‌ ఇచ్చినట్లు తెలుసుకొని కంగుతిన్నారు. హరియాణా, చండీగఢ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లలోనే 150 చోరీలకు పాల్పడ్డాడట. 90 సార్లు కటకటాలవెనక్కి వెళ్లి వచ్చిన ఘరానా దొంగ.. 77ఏళ్ల వయసులోనూ (2016లో) రాణీబాగ్‌లో ఓ కారును తస్కరించి పోలీసులకు చిక్కాడు. ఇలా అతడు అరెస్టు కావడం 95వ సారి అని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధని రామ్‌ మిత్తల్‌.. ఏప్రిల్‌ 18న గుండెపోటుతో మృతి చెందాడు. దిల్లీలోని నిగంబోధ్‌ ఘాట్‌లో అతడి కుమారుడు అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు