Third Wave: పిల్లలపై ప్రభావం..ఆందోళన వద్దు!

కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ధాటికి యావత్‌ దేశం వణికిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థర్డ్‌ వేవ్‌ వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపించనుందని వస్తోన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. థర్డ్‌ వేవ్‌ విజృంభణలో చిన్న పిల్లలు తీవ్రంగా ప్రభావితం అవుతారనే సూచనలు ఇప్పటివరకు

Published : 25 May 2021 01:25 IST

వైరస్ సోకినా ప్రభావం తక్కువే : కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ధాటికి యావత్‌ దేశం వణికిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థర్డ్‌ వేవ్‌ వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపించనుందని వస్తోన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. థర్డ్‌ వేవ్‌ విజృంభణలో చిన్న పిల్లలు తీవ్రంగా ప్రభావితం అవుతారనే సూచనలు ఇప్పటివరకు లేవని స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ థర్డ్‌ వేవ్‌ వస్తే చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపించనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, వీటిని తోసిపుచ్చిన పీడియాట్రిక్స్‌ అసోసియేషన్‌.. అవి వాస్తవాల ఆధారంగా అంచనా వేసినవి కావని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ చిన్న పిల్లలపై ప్రభావం చూపించకపోవచ్చని, ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. పిల్లలు వైరస్‌ బారినపడే అవకాశం ఉన్నప్పటికీ వారిలో వైరస్‌ ప్రభావం మాత్రం తక్కువే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

‘‘ఒకవేళ చిన్నారులు వైరస్‌ బారినపడిన పడితే.. వారిలో లక్షణాలు కనిపించకపోవచ్చు లేదా స్వల్పంగానే ఉండవచ్చు. సాధారణంగా ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితులు మాత్రం ఉత్పన్నం కావు’’ అని నీతి ఆయోగ్‌(ఆరోగ్యం) సభ్యులు వీకే పాల్‌ పేర్కొన్నారు. ‘‘చిన్నారులకు వైరస్‌ సోకుతుందనే కొన్ని వాస్తవాలు మనముందున్నాయి. వారిలోనూ ఓ మోస్తరు వరకు పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. పిల్లల్లో వైరస్‌ సంక్రమణ తక్కువగా ఉందని కచ్చితంగా చెప్పలేము. డిసెంబర్‌-జనవరి మధ్య నిర్వహించిన సీరో సర్వేలో చిన్నారుల్లో సీరోపాజిటివిటీ రేటు పెద్దవారితో దాదాపు సమానంగా ఉంది’’ అని వీకే పాల్‌ గుర్తుచేశారు. చిన్నారుల నుంచి వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం మాత్రం ఉందన్నారు. కొవిడ్‌ సోకిన చిన్నారులకు చికిత్స చేసేందుకు వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచుకోవాలని.. అదే సమయంలో వైరస్‌ సంక్రమణలో వీరిని ముందు వరుసలో రాకుండా చూసుకోవడమే అత్యంత ముఖ్య విషయమన్నారు.

దేశంలో సెకండ్‌ వేవ్‌తో వణికిపోతున్న పలు రాష్ట్రాలు థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపిస్తుందన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వారికి చికిత్స కోసం వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని