Priyanka Gandhi: డబుల్ ఇంజిన్‌ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు: ప్రియాంక గాంధీ

Eenadu icon
By National News Team Updated : 30 Dec 2024 16:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (BPSC) ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆదివారం వేలాదిమంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్‌ వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. వారిని అడ్డుకోవడానికి పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించి.. లాఠీఛార్జి చేయడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్రంగా ఖండించారు. డబుల్ ఇంజిన్‌ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. ఈ చలిలో విద్యార్థులపై జలఫిరంగులు ప్రయోగించడం, లాఠీఛార్జి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తంచేశారు.

బిహార్‌లో మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండుసార్లు విద్యార్థులను చిత్రహింసలకు గురిచేసిందని మండిపడ్డారు. పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్‌లు, పేపర్ లీక్‌లను అరికట్టడం తమ బాధ్యత అనే విషయం మరిచిపోయిందన్నారు. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే సహించలేక వారిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

అభ్యర్థులపై పోలీసుల చర్య బాధాకరం..

బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ (Tejashwi Yadav) మాట్లాడుతూ.. అభ్యర్థులపై పోలీసుల చర్య చాలా బాధాకరమని అన్నారు. “బీపీఎస్సీ అభ్యర్థులపై పోలీసుల చర్య చాలా దారుణం. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. బయటకు వచ్చిన వీడియోలను చూస్తుంటే వారెంత బాధను అనుభవించారో అర్థమవుతోంది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇది నిరంకుశ ప్రభుత్వ నియంతృత్వానికి ఉదాహరణ..

ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) ఈ సంఘటనను నిరంకుశ ప్రభుత్వ నియంతృత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న యువతతో పోలీసులు క్రూరంగా ప్రవర్తించడం ప్రభుత్వ నియంతృత్వాన్ని మరోసారి ప్రజలకు తెలియజేసిందని అన్నారు. విద్యార్థిగా ఎన్నో ఉద్యమాలు చేసి.. సీఎం స్థాయికి ఎదిగిన నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం నుంచి ఈ ప్రవర్తనను తానెప్పుడూ ఊహించలేదని అన్నారు. విద్యార్థులతో అధికారులు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు.

బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బీపీఎస్సీ)ల్లో అవకతవకల విషయంలో ఆదివారం వేలాదిమంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్‌ వద్ద నిరసనకు దిగారు. జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ విద్యార్థులకు పూర్తి మద్దతును ప్రకటించారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో కిశోర్‌తోపాటు పలువురు విద్యార్థులపైనా పోలీసులు కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.

Tags :
Published : 30 Dec 2024 12:30 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని