Sandeshkhali: ‘సందేశ్‌ఖాలీ’ నిందితుడు షాజహాన్‌ షేక్‌ అరెస్టు

Sandeshkhali: సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు రాష్ట్ర పోలీసుల గురువారం ఉదయం ప్రకటించారు.

Updated : 29 Feb 2024 10:30 IST

Sandeshkhali | కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసుల గురువారం ఉదయం ప్రకటించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాలోని ఓ ఇంట్లో బుధవారం ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం బసిర్హత్ న్యాయస్థానానికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

‘రేషన్‌ బియ్యం కుంభకోణం’ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్‌ షేక్‌ ఇంట్లో తనిఖీల కోసం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై ఆయన అనుచరులు గత నెల 5న దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సందేశ్‌ఖాలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. వచ్చే నెల 6 నుంచి ప్రధాని మోదీ బెంగాల్‌లో పర్యటించే అవకాశం ఉన్న తరుణంలో ఈ అరెస్టు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

షాజహాన్‌ షేక్‌ను 72 గంటల్లోగా అరెస్టు చేయాలని.. లేనిపక్షంలో అందుకు కారణాలను తనకు నివేదించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. లేదంటే తానే సందేశ్‌ఖాలీకి మకాం మారుస్తానన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో దుండగులు ఓ చిన్నారిని విసిరేశారన్న ఘటనపై విచారణ జరపాలని, అది నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్‌ లేఖలో పేర్కొన్నారు. షాజహాన్‌ను అరెస్టు చేయాలని సోమవారం కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

చట్టపరమైన చిక్కుముళ్ల కారణంగానే షాజహాన్‌ను ఇప్పటి వరకు అరెస్టు చేయలేకపోయారని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ తెలిపారు. ఆయన అరెస్టుపై స్టే లేదని కోర్టు స్పష్టం చేయటంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు తమ పని నిర్వర్తించారని పేర్కొన్నారు.. ఆయన అరెస్టుపై విధించిన ఆంక్షలను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశాయని ఆరోపించారు.

మరోవైపు షాజహాన్‌ మంగళవారం రాత్రి నుంచి బెంగాల్‌ పోలీసుల ‘సురక్షిత కస్టడీ’లోనే ఉన్నారని భాజపా చెబుతోంది. తాజా అరెస్టు కేవలం వారి ముందస్తు ప్రణాళికలో భాగమేనని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సుకాంత్‌ మజుందార్‌ ఆరోపించారు. టీఎంసీ, రాష్ట్ర పోలీసులు కలిసి నిందితులను రక్షిస్తున్నారన్నారు. తమ పార్టీ నిరంతర ఒత్తిడి వల్లే ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని