Work Life: ‘వర్క్‌ ఫ్రమ్‌ బీచ్‌’.. గోవా సీఎం ఏమన్నారంటే..!

‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ మాదిరి గోవా బీచ్‌ల నుంచే సందర్శకులు తమ ఆఫీసు పని చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం ప్రమోద్‌ సావంత్ తెలిపారు.

Published : 24 Mar 2024 00:08 IST

పణాజీ: అందమైన సముద్ర తీరాలు.. సాహసోపేత జలక్రీడలకు గోవా (Goa) ప్రసిద్ధి. దేశవిదేశాల నుంచి ఏటా పెద్దఎత్తున పర్యటకులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు. అయితే.. ఆఫీసు పనుల కారణంగా కొంతమంది ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వారినీ రప్పించేందుకు గోవా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ మాదిరి ఇక్కడి బీచ్‌ల నుంచే సందర్శకులు తమ ఆఫీసు పని (Work From Beach) చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్ తెలిపారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ప్రజలు గోవాకు రావచ్చు.. విశ్రాంతి తీసుకోవచ్చు.. అదే విధంగా ఆఫీసు పని కూడా చేసుకోవచ్చు. ఈ దిశగా ‘డిజిటల్ నోమాడ్’ విధానం తీసుకొస్తున్నాం’ అని వెల్లడించారు.

భారత్‌లో ఆ బీచ్‌లకు అరుదైన గౌరవం

‘‘స్థానికంగా ప్రతి గ్రామం డిజిటల్‌గా అనుసంధానమై ఉంది. పనాజీలో ఇంటింటికీ ఫైబర్ నెట్‌ సదుపాయం త్వరలో పూర్తి కానుంది. మేం ‘బీచ్ నుంచి పని’ విధానాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ దిశగా ‘డిజిటల్ నోమాడ్’ విధానాన్ని ప్రవేశపెట్టనున్నాం. దీని ద్వారా పర్యటకులు ఇక్కడినుంచే ఆఫీసు పని చేసుకోవచ్చు. దీనికి తగిన వాతావరణం కల్పిస్తాం’’ అని సీఎం సావంత్‌ వివరించారు. స్థానికంగా ఆధ్యాత్మిక పర్యటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ‘‘మిరామర్ బీచ్‌లో సముద్ర హారతి ప్రారంభించాం. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. భవిష్యత్తులో గోవా ‘దక్షిణ కాశీ’గా గుర్తింపు పొందుతుంది. యోగా కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు పెట్టుబడులూ వస్తున్నాయి’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని