LOC: ‘పీవోకే’లో టెలికాం టవర్ల పెంపు.. ఉగ్ర చొరబాట్లకు పాక్‌ కుటిల చర్య!

భారత్‌లోకి ఉగ్ర చొరబాట్లకు సాయంగా పాకిస్థాన్‌ ఇటీవలి కాలంలో ‘పీవోకే’లో టెలికాం టవర్ల సంఖ్యను పెంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Published : 18 Feb 2024 19:58 IST

జమ్మూ: భారత్‌లోకి అక్రమ చొరబాట్ల విషయంలో పాకిస్థాన్‌ (Pakistan) తన కుటిల యత్నాలు మానుకోవడం లేదు. చొరబాటు కార్యకలాపాల్లో ఉగ్రమూకలకు సాయంగా ఇటీవలి కాలంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో నియంత్రణ రేఖ (LOC) వెంబడి టెలికాం టవర్ల సంఖ్యను పెంచినట్లు భారత అధికారిక వర్గాలు వెల్లడించాయి. జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా, రాజౌరీ, పూంఛ్‌ తదితర జిల్లాలను ప్రభావితం చేస్తూ.. పీవోకే నుంచి టెలికాం సంకేతాలు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయని భద్రతా ఏజెన్సీలు హెచ్చరించిన వేళ ఇది బయటపడింది.

‘‘రహస్య సమాచార వ్యవస్థ కోసం సీడీఎంఏ, వైఎస్‌ఎంఎస్‌ ఎన్‌క్రిప్షన్‌ సాంకేతికతల ద్వారా స్మార్ట్‌ఫోన్లు, రేడియో సెట్స్‌ సేవలను ఉగ్రసంస్థలు మిళితం చేస్తున్నాయి. ఓ చైనా సంస్థ దీనికి సాయం అందించింది. టెలికాం టవర్ల ద్వారా పీవోకేలోని ఉగ్రనాయకులు.. చొరబాటుదారులు, జమ్మూ ప్రాంతంలోని మూకలతో కనెక్ట్ అవుతున్నారు. భద్రత బలగాలు తమను గుర్తించకుండా జాగ్రత్తపడుతున్నారు. జమ్మూ ప్రాంతంలో, ముఖ్యంగా పీర్ పంజాల్‌కు దక్షిణాన ఇటీవల చోటుచేసుకున్న చొరబాట్లు, ఉగ్ర దాడులను అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైంది’’ అని అధికారులు తెలిపారు.

పాక్‌ ఎన్నికల్లో రావల్పిండి రగడ.. దేశ వ్యాప్తంగా ఎక్స్‌ సేవలు బంద్‌..!

గతంలో పాకిస్థాన్ నిఘాసంస్థ ‘ఐఎస్‌ఐ’తో కలిసి పనిచేసినట్లు భావిస్తున్న ఆ దేశ ఆర్మీ అధికారి ఉమర్ అహ్మద్ షా నేతృత్వంలోని స్పెషల్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ (SCO)కు ఈ టెలికాం సేవల విస్తరణ ప్రాజెక్టును అప్పగించినట్లు సమాచారం. ఎల్‌వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల సమీపంలో వ్యూహాత్మక అవసరాలకు టెలికాం టవర్‌లను నిర్మించడం ఐరాస నిబంధనలకు విరుద్ధం. 2019, 2020ల్లోనూ ఇటువంటి సాంకేతికతలను ఉగ్రవాదులు ఉపయోగించారు. అయితే.. భద్రతా ఏజెన్సీలు వాటిని అడ్డుకున్నాయి. ఇప్పుడు కూడా ఓ సరికొత్త టెక్నాలజీని పరీక్షించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని