Viral post: జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ వైరల్‌

ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్‌ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Published : 24 Apr 2024 00:12 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) పరీక్ష భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటి. ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది దీనికోసం ప్రయత్నిస్తుంటారు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పేరొందిన దీనికి వ్యూహాత్మక ప్రణాళిక, అంకితభావం, క్రమశిక్షణ అవసరం. కాగా ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్‌ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తాము ఇద్దరం కలిసి యూపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యే వాళ్లమని చెప్తూ ఐపీఎస్ అధికారి అర్చిత్ చందక్ తన స్నేహితుడి గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘నిన్న హర్ష్‌ని కలిశాను. మేమిద్దరం ఒకే రూంలో ఉండి యూపీఎస్సీ కోసం ప్రిపేర్‌ అయ్యేవాళ్లం. హర్ష్‌ చాలా అంకితభావంతో కష్టపడి చదివేవాడు. సివిల్స్‌ కోసం తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. నాలుగుసార్లు పరీక్షలో పాసయ్యాడు. 3 ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ స్థానాన్ని పొందలేకపోయాడు. కాని అతడు కుంగిపోలేదు. ధైర్యంగా మరో దారిలోకి వెళ్లాడు. ప్రస్తుతం టెండెంట్‌లో గౌరవప్రదమైన స్థానంలో మంచి జీతంతో సంతోషంగా పని చేసుకుంటున్నాడు. మన జీవితంలో ఏ విజయం అంతిమమైనది కాదు. అలాగే ఏ పరాజయం ప్రాణాంతకం కాదు. జీవితంలో ముందుకువెళ్లాలంటే ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం’’ అని రాసుకొచ్చారు. అతని స్నేహితుడితో ఉన్న ఫోటోను జత చేశారు. ఐపీఎస్‌ అధికారి పెట్టిన ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఈ పోస్టుపై తమ భావనలను వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ  ‘యూపీఎస్సీ అనేది ప్రపంచంలో చివరి అంశమేమీ కాదు. అంతకంటే మెరుగైన జీవితం కూడా ఉంటుంది.’ అని వ్యాఖ్యానించారు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘‘మనం సివిల్స్‌లో విజయం సాధించాలంటే కష్టపడి చదవడం చాలా ముఖ్యం. దానివల్ల నేను ప్రయత్నించకుండానే వదులుకున్నాను అనే భావన మనకు రాదు’’ అంటూ రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని