Tomatoes: ఆంక్షల ఎత్తివేత.. నేపాల్‌ నుంచీ టమాటాల దిగుమతి

నేపాల్‌ నుంచీ టమాటాలను దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. త్వరలో దిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో టమాటాలను కిలో రూ.70కే అందుబాటులో ఉంచుతామన్నారు.

Published : 10 Aug 2023 18:41 IST

దిల్లీ: ధరల్లో భారీ పెరుగుదలతో కొంతకాలంగా ‘టమాటా (Tomatoes)’ వార్తల్లో నిలుస్తోంది. రికార్డు స్థాయి రేటుతో సామాన్యులు కొనలేని పరిస్థితికి చేరుకుంది. అయితే, టమాటా ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. విపక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No Confidence Motion)పై ప్రసంగిస్తూ.. టమాటా ధరల అంశాన్నీ ప్రస్తావించారు. త్వరలోనే దిల్లీ- ఎన్‌సీఆర్‌ పరిధిలో టమాటాలను కిలో రూ.70కే అందుబాటులో ఉంచుతామని చెప్పారు. నేపాల్‌ నుంచీ టమాటాల దిగుమతికి పచ్చజెండా ఊపినట్లు తెలిపారు.

‘ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ధరలను నియంత్రించేందుకు మంత్రుల బృందం సకాలంలో చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మొజాంబిక్‌ నుంచి కంది పప్పును, మయన్మార్‌ నుంచి మినప పప్పును దిగుమతి చేసుకుంటున్నాం. అదనపు నిల్వల కోసం సుమారు మూడు లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాం. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి ప్రభుత్వం టమాటాలను సేకరించి.. సహకార సంఘాల ద్వారా దిల్లీ ఎన్‌సీఆర్‌తోపాటు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో పంపిణీ చేస్తోంది’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

మీరు జయలలితను అవమానించిన విషయం మర్చిపోయినట్లున్నారు: నిర్మలా సీతారామన్‌

‘జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్‌).. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో 8.84 లక్షల కిలోల టమాటాలను పంపిణీ చేసింది. రానున్న వారాంతంలో దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కిలో రూ.70 చొప్పున టమాటాల విక్రయానికి భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఆంక్షలు ఎత్తివేసి, పొరుగు దేశం నేపాల్ నుంచి కూడా టమాటాల దిగుమతులకు అనుమతించాం. ఈ వారంలో వాటిని లఖ్‌నవూ, వారణాసి, కాన్పూర్ వంటి నగరాలకూ చేరుస్తాం’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అంతకుముందు దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ.. ఈ రోజు భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని