Nirmala Sitharaman : మీరు జయలలితను అవమానించిన విషయం మర్చిపోయినట్లున్నారు : నిర్మలా సీతారామన్‌

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభలో మాట్లాడారు. ఆమె దివంగత ముఖ్యమంత్రి జయలలితకు (Jaya lalitha) జరిగిన అవమానాన్ని గుర్తు చేశారు. 

Published : 10 Aug 2023 15:47 IST

దిల్లీ : పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No Confidence Motion)పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మాట్లాడారు. మణిపుర్‌లో మహిళలపై జరుగుతున్న హింసను ప్రస్తావించిన డీఎంకే సభ్యులపై ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నిండు సభలో అవమానం జరిగిన విషయాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించారు. తొలుత డీఎంకే ఎంపీ కనిమొళి సభలో మాట్లాడుతూ దేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తాం: నామా

దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్‌ ‘మణిపుర్‌, రాజస్థాన్‌, దిల్లీతో సహా ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా దాన్ని తీవ్రంగా పరిగణించాలి. రాజకీయాలు చేయకూడదు. ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న మహిళను గతంలో డీఎంకే సభ్యులు అసెంబ్లీలోనే అవమానించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తరువాతనే మళ్లీ సభలో అడుగు పెడతానని ఆనాడు జయలలిత శపథం చేశారు. రెండేళ్ల తర్వాత ఆమె ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారని’ 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవమానాన్ని గుర్తు చేశారు. 

దాంతో డీఎంకే ఎంపీలు నిరసనకు దిగారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి ‘మీరు కౌరవ సభ, ద్రౌపది గురించి మాట్లాడుతున్నారు. కానీ, డీఎంకే జయలలితను మర్చిపోయిందా? నమ్మబుద్ధి కావట్లేదని’ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రాష్ట్రాలపై రుద్దుతోందని కనిమొళి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నరేంద్రమోదీ ప్రభుత్వం ‘సిలప్పదికారం’ స్ఫూర్తిని అమలు చేస్తోందని చెప్పారు. సెంగోల్‌ను న్యాయానికి చిహ్నంగా కొత్త పార్లమెంటులో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ దాన్ని ఇన్నాళ్లూ మర్చిపోయి మ్యూజియంలో పెట్టడం తమిళులను అవమానించినట్లు కాదా అని ప్రశ్నించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని