LokSabha: లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు: ఏడీఆర్‌

లోక్‌సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ఏడీఆర్‌ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది.

Published : 29 Mar 2024 17:25 IST

దిల్లీ: లోక్‌సభలోని (Loksabha) 514 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్‌ పలు వివరాలతో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైమాటే. క్రిమినల్‌ కేసులు నమోదైన వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదుకాగా.. వారిలో ఐదుగురు భాజపాకి చెందినవారే. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైతే.. వారిలో 21 మంది భాజపాకి చెందినవారే కావడం గమనార్హం. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. 

మరోవైపు జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లలోనే ఎక్కువ మంది కోటీశ్వరులు ఉన్నట్లు ఏడీఆర్‌ తేల్చింది. అత్యంత ధనిక ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన నకుల్‌నాథ్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో డీకే సురేశ్‌ (కాంగ్రెస్‌), కనుమూరు రఘురామ కృష్ణరాజు (ఇటీవల వైకాపాకి రాజీనామా చేశారు) ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలపైనే ఎక్కువగా క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ఏడీఆర్‌ విశ్లేషణలో తేలింది. ఆయా రాష్ట్రాల్లో సగానికిపైగా ఎంపీలపై కేసులున్నాయి. ఎంపీల విద్యార్హతలను కూడా ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. 73శాతం మంది ఎంపీలు గాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లు వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని