Himachal Pradesh: హిమాచల్‌లో వరదల భయోత్పాతం.. 50కి చేరిన మృతులు

Himachal Pradesh Rains: హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. 

Published : 14 Aug 2023 21:34 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో (Himachal Pradesh) వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా గత 24 గంటల వ్యవధిలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరినట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. మరోవైపు మండి జిల్లాలోని సంబల్‌ గ్రామంలో వరద పొంగిపొర్లడంతో ఏడుగురు కొట్టుకు పోయినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియో వణుకుపుట్టిస్తోంది. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అంతకుముందు రెండు వేర్వేరు ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సోలన్‌ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. శిమ్లా పట్టణంలోని దేవాలయం కూలిన ఘటనలో మరో 9 మంది మృతి చెందారు. 20కిపైగా మంది అందులో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి శిమ్లా పట్టణంలో కొండచరియలు విరిగిపడటంతో దానికింద 15 నుంచి 20 మంది చిక్కుకున్నారు. ఫగ్లీ ప్రాంతంలో పదుల సంఖ్యలో ఇళ్లు బురదలో కూరుకుపోయాయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం ఘటనల్లో ఇప్పటివరకు 50 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

హిమాచల్‌లోని పరిస్థితులపై ఆరా తీసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దని ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు విజ్ఞప్తి చేశారు. నది ఒడ్డున నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారంతా వెంటనే ఖాళీ చేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటకులెవరూ రాష్ట్రానికి రావొద్దని అన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గత 48 గంటల్లో కురిసిన వర్షాల దెబ్బకు బియాస్‌, దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. మాన్‌, కునా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హమీర్‌పుర్‌లో భవనాలు దెబ్బతిన్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ సీజన్‌లో వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7,020.28 కోట్ల నష్టం జరిగింది. జూన్‌ 24 నుంచి కురుస్తున్న వర్షాల్లో 257 మంది  ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది ఆచూకీ గల్లంతుకాగా.. 290 మంది గాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు