Atiq Ahmed: అతీక్‌ వేల కోట్ల నేర సామ్రాజ్యం.. ఈడీ ఎదుట అతిపెద్ద సవాల్‌

అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed)నేర సామ్రాజ్యంలో ఆస్తులను చూస్తే కళ్లు చెదరాల్సిందే. అధికారులు దాడుల్లో గుర్తించిన ఆస్తుల విలువే ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.వెయ్యి కోట్లకుపైగా ఉంది. బినామీ ఆస్తుల జాబితా కోసం వేట సాగుతోంది.

Updated : 18 Apr 2023 13:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మాఫియా డాన్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్(Atiq Ahmed) సోదరుల మరణం తర్వాత ఈడీకి ఇప్పుడు అతిపెద్ద తలనొప్పి మొదలైంది. అతీక్‌(Atiq Ahmed) నేరసామ్రాజ్యంతో సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తుల బినామీలను గుర్తించడం ఇప్పుడు దర్యాప్తు సంస్థకు సవాలుగా మారింది. అతీక్‌(Atiq Ahmed) ప్రయాగ్‌రాజ్‌ సహా ఇతర నగరాల్లో బినామీల ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టాడు. 2021లో ఈడీ అతడిపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి 10 చోట్ల రైడ్‌ చేసింది. ఇప్పటికే గుర్తించిన ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1,168 కోట్లు విలువ చేస్తాయని యూపీ లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ గతంలో వెల్లడించారు. ఈ ఆస్తుల మార్కెట్‌ విలువ కొన్ని వేల కోట్లు ఉంటుందని అంచనా. దాదాపు రూ.417 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేయగా.. మరో రూ.752 కోట్ల విలువైన ఆస్తులను కూల్చడమో.. కబ్జా నుంచి విడిపించడమో చేశారు. అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని అతీక్‌(Atiq Ahmed) తెలిసిన రాజకీయ నాయకులు, బిల్డర్లు, పెద్ద కాంట్రాక్టర్లు, హోటల్‌ ఓనర్లు, డాక్టర్లు, లాయర్లు వంటి వారి ద్వారా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టించి లాభాల్లో వాటా తీసుకొనేవాడు. ఈ క్రమంలోనే సోమవారం ఈడీ.. సంజీవ్‌ అగర్వాల్‌ అనే బిల్డర్‌కు సమన్లు జారీ చేసింది.

ఏ ఆస్తిపైనైనా అతీక్‌(Atiq Ahmed) కన్ను పడితే అది అతడి సొంతం కావాల్సిందేనని 1990ల్లో ప్రయాగ్‌రాజ్‌లో పనిచేసి ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పదవీవిరమణ చేసిన అధికారి లాల్జీ శుక్లా వెల్లడించారు. ప్రభుత్వ భూములు, వ్యాపారుల ఆస్తులు, రైతుల పొలాలు వంటి వాటిని అతీక్‌(Atiq Ahmed) ఆక్రమించుకొనేవాడు. దీంతోపాటు నిర్మాణ రంగ, విద్యుత్తు, అలహాబాద్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, రైల్వే టెండర్లను ఏకపక్షంగా దక్కించుకోవడం అతడి మరో ప్రధాన వ్యాపారం.

గాంధీ కుటుంబ బంధువు ఆస్తినే కబ్జా చేసి.. 

ప్రయాగ్‌రాజ్‌లోని ఖరీదైన ప్రదేశంగా పేరున్న సిటీలైన్స్‌లో వెర గాంధీ అనే వృద్ధురాలికి ప్యాలెస్‌ టాకీస్‌ భవనం ఉంది. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌గాంధీకి ఆమె దగ్గరి బంధువు. ఆ భవనం పక్కనే అతీక్‌ అహ్మద్‌ ఓ వ్యాపారవేత్త నుంచి బలవంతంగా కొంత స్థలం కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టాడు. ఆ పనుల పర్యవేక్షణకు వచ్చినప్పుడు ఎండలో ఉండాల్సి వస్తోందని.. ప్యాలెస్‌ టాకీస్‌లో కొంత స్థలం ఇస్తే అక్కడి నుంచి పనులను పర్యవేక్షించుకొంటానని అడిగాడు. కానీ, ప్యాలెస్‌ టాకీస్‌ మేనేజర్‌ నిరాకరించాడు. దీంతోపాటు వెర గాంధీకి సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఆమెకు ఓ శస్త్ర చికిత్స జరిగి మంచంపై ఉంది. అతీక్‌తో గొడవ దేనికని.. ఓ చిన్న గది ఏర్పాటు చేసి ఇవ్వమని సూచించింది. కానీ, ఆ తర్వాత అతీక్‌(Atiq Ahmed) మొత్తం ఆస్తిని తన కబ్జాలో పెట్టుకొని తాళాలు ఇవ్వడానికి నిరాకరించాడు.  

దీంతో వెర గాంధీ నాటి యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ, యూపీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌కు లేఖలు రాసి తన గోడు వెళ్లబోసుకొంది. అప్పటికి అతీక్‌(Atiq Ahmed) పార్లమెంట్‌ సభ్యుడు. సోనియా గాంధీ ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకొని.. ఈ సమస్య పరిష్కరించే బాధ్యతను యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు రీటా బహుగుణా జోషికి అప్పగించారు. మరోవైపు పీఎంవో నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో అతీక్‌ చేసేదేమీ లేక స్వయంగా వెర గాంధీ వద్దకు వెళ్లి తాళాలు అప్పజెప్పాడు. ‘‘నాకు ఫోన్‌ చేస్తే నేనే తాళాలు అప్పజెప్పేవాడిని కదా’’ అని అతీక్‌ తనతో అన్నట్లు వెర గాంధీ గతంలో ఓ పత్రికకు వెల్లడించారు. అతీక్‌ ఆక్రమించిన తర్వాత వదిలేసిన ఏకైక ఆస్తి అదొక్కటే అని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి లాల్జీ శుక్లా వెల్లడించారు.

జైల్లోనే రూ.40 కోట్ల ఆస్తి రాయించుకొని..

2018లో అతీక్‌(Atiq Ahmed) డియోర జైల్లో ఉండగా.. అతడి కుమారుడు ఉమర్‌, అనుచరులు కలిసి మోహిత్‌ జైస్వాల్‌ అనే వ్యాపారవేత్తను కిడ్నాప్‌ చేశారు. అతడిని డియోర జైలుకు తీసుకెళ్లి అతీక్‌ ఎదుట హాజరుపర్చారు. అక్కడే అతడి పేరిట ఉన్న రూ.40 కోట్ల విలువైన నాలుగు కంపెనీలను అతీక్‌ రాయించుకొన్నాడు. ఈ క్రమంలో అతడిని జైల్లోనే తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై మోహిత్‌ డిసెంబర్‌లో పోలీస్‌ కేసు పెట్టారు. అప్పటికే యూపీలో కొత్త ప్రభుత్వం రావడంతో అతీక్‌పై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత గుజరాత్‌లోని సబర్మతీ జైలుకు తరలించారు. నాటి నుంచి అతీక్‌ అక్కడే ఉన్నాడు. ఇక అతడి కుమారుడు ఉమర్‌ను కూడా అరెస్టు చేసి జైల్లోవేశారు.

భూముల ఆక్రమణ..

కరేలీ, ధూమన్‌ గంజ్‌, కోత్వాలీ, పుర ముఫ్తీ, ఖులాదాబాద్‌, పిపారి వంటి ప్రాంతాల్లో అతీక్‌(Atiq Ahmed) భారీగా భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక జాన్సన్‌ గంజ్‌లో వర్క్‌షాప్‌, షాగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఓ హోటల్‌ను, సివిల్‌ లేన్స్‌లో వర్క్‌షాప్‌ వంటివి అతీక్‌ ఆక్రమణల చిట్టాలో కొన్ని. సివిల్‌ లేన్స్‌లోని రాయల్‌ హోటల్‌ ఆక్రమణకు యత్నించగా దాని యజమానులు కోర్టుకు వెళ్లారు. ఇక సూరజ్‌కలి అనే మహిళ కుటుంబానికి చెందిన సుమారు 2.4ఎకరాల భూమిని అతీక్‌ గ్యాంగ్‌ కబ్జా చేసింది. దీనికి అడ్డుగా నిలిచినందుకు ఆమె భర్త బ్రిజ్‌మోహన్‌ను కిడ్నాప్‌ చేసింది. అతడి ఆచూకీ ఇప్పటి వరకు తెలియదు. సూరజ్‌కలిని కూడా కిడ్నాప్‌ చేసి బెదిరించింది. ఆమె ఇంటిపై, కుటుంబసభ్యులపై మూడు సందర్భాల్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడం, బాంబులతో దాడిచేయడం వంటివి చేశారు. కానీ, సూరజ్‌ కుటుంబం భయపడకుండా అతీక్‌పై కేసులు పెట్టి న్యాయపోరాటం చేస్తోంది.

2020లో నగరపాలక సంస్థ ప్రయాగ్‌రాజ్‌లోని చకియా ప్రాంతంలో అతీక్‌(Atiq Ahmed) ఇంటిని కూల్చివేసింది. ఇది కూడా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిందే. 2021లో లుకర్‌గంజ్‌ ప్రాంతంలో అతీక్‌ ఆక్రమించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొన్నారు. అక్కడ 76 ఫ్లాట్లను నిర్మించి త్వరలో పీఎం ఆవాస్‌ యోజన కింద పేదలకు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ స్థాయిలో సంపాదించిన అతీక్‌(Atiq Ahmed) ఆస్తులు ఇప్పుడు బినామీల వద్ద పడి ఉన్నాయి. వీటిని ఈడీ వెలికితీసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని