Odisha CM: ఒడిశా సీఎంగా మోహన్‌చరణ మాఝి

గిరిజన నేత మోహన్‌చరణ మాఝి ఒడిశా ముఖ్యమంత్రిగా బుధవారం పదవీ ప్రమాణం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ సభాపక్ష నేతల సమావేశం జరిగింది.

Published : 12 Jun 2024 06:14 IST

గిరిజన నేతకు భాజపా అవకాశం
ఉపముఖ్యమంత్రులుగా కనక్‌ వర్ధన్‌ సింగ్‌దేవ్, ప్రవతి పరీదా

భువనేశ్వర్, న్యూస్‌టుడే: గిరిజన నేత మోహన్‌చరణ మాఝి ఒడిశా ముఖ్యమంత్రిగా బుధవారం పదవీ ప్రమాణం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ సభాపక్ష నేతల సమావేశం జరిగింది. పర్యవేక్షకులుగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అటవీ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ పాల్గొన్నారు. వీరితోపాటు కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, జుయెల్‌ ఓరం, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. గంటన్నరపాటు చర్చించారు. తర్వాత విలేకర్లతో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ సీఎంగా మోహన్‌ చరణ మాఝిని శాసనసభ్యులంతా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఆయనతో పాటు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కనక్‌ వర్ధన్‌ సింగ్‌దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరీదాలను ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. ప్రవతి పరీదా ఒడిశాకు తొలి మహిళా ఉపముఖ్యమంత్రి అవుతారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్‌ గమాంగ్‌ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా, ఇప్పుడు మాఝి మూడో గిరిజన ముఖ్యమంత్రి అవుతారు. ఈ సందర్భంగా మోహన్‌చరణ మాఝి విలేకర్లతో మాట్లాడుతూ, ‘‘జగన్నాథుడి ఆశీస్సులతో భాజపాకు ఒడిశాలో మంచి ఆధిక్యం లభించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాం. మార్పు కోరుతూ ఓట్లేసిన 4.5 కోట్ల మంది ఒడిశా వాసులకు ధన్యవాదాలు’’ అని చెప్పారు.

రైతు బిడ్డ మోహన్‌

సీఎంగా ఎన్నికైన మోహన్‌ చరణ మాఝి ప్రముఖ గిరిజన నేత. రైతు బిడ్డ. ఆయన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డుగానూ పనిచేసేవారు. 1997 నుంచి 2000 వరకు మాఝి సర్పంచిగా పనిచేశారు. దాంతోపాటు భాజపా గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన మాఝి... కేంఝర్‌ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు 2000, 2009, 2019, మళ్లీ 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకూ శాసనసభలో భాజపా సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్‌ విప్‌గా విధులు నిర్వహించారు.


జననం: 1972 జనవరి 6 
వయసు: 52 ఏళ్లు
విద్యార్హత: బీఏ, ఎల్‌ఎల్‌బీ
స్వస్థలం: కేంఝర్‌
నియోజకవర్గం: కేంఝర్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని