Amit Shah: పీవోకే మనదే.. అక్కడ 24 సీట్లు రిజర్వ్: హోంమంత్రి అమిత్ షా ప్రకటన

Amit Shah: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మనదేనని.. అందుకే అక్కడ సీట్లను రిజర్వ్ చేసి పెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది.

Updated : 06 Dec 2023 16:57 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ‘జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023’, ‘జమ్మూకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లు-2023’ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. వాటికి దిగువసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల్లో పునర్విభజన తర్వాత శాసనసభ నియోజక వర్గాల సంఖ్య ఎలా ఉండనుంది? రిజర్వేషన్ల అమలు ఎలా? వంటి అంశాలను పొందుపర్చారు. వీటిపై లోక్‌సభ (Lok Sabha)లో రెండు రోజుల పాటు చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. బిల్లు (Bills)ల్లోని కీలక అంశాలను సభకు వెల్లడించారు.

గతంలో జమ్మూకశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. తాజా బిల్లులో దాన్ని 90కి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతకుముందు కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్ము డివిజన్‌లో 37 స్థానాలు ఉండేవి. తాజా బిల్లులో కశ్మీర్‌ డివిజన్‌లో అసెంబ్లీ స్థానాలను 47, జమ్ము డివిజన్‌లో 43కు పెంచినట్లు అమిత్ షా వెల్లడించారు. ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) మన దేశంలో భాగమేనని ఆయన అన్నారు. అందుకే, అక్కడ కూడా 24 స్థానాలను రిజర్వ్‌ చేసినట్లు ప్రకటించారు. ఇక, కశ్మీర్‌లో రెండు స్థానాలను కశ్మీర్‌ నుంచి వలసవెళ్లినవాళ్లు, ఒక స్థానాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చి స్థిరపడినవారికి రిజర్వ్‌ చేసినట్లు అమిత్ షా తెలిపారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీలకు 9 స్థానాలు కేటాయించినట్లు పేర్కొన్నారు.

వారి రాజకీయ చతురత రాహుల్‌ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్‌ ముఖర్జీ

కశ్మీర్‌ బిల్లులతో వారికి న్యాయం..

‘‘70 ఏళ్లుగా అన్యాయానికి, అవమానాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నాను. ఏ సమాజంలోనైనా వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలి. ఈ క్రమంలో వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూడాలి. అదే భారత రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశం. ప్రస్తుతం చాలా మంది కశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. ఈ బిల్లుతో వారికి హక్కులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు వస్తాయి’’ అని అమిత్‌షా వెల్లడించారు.

ఇక ప్రతిపక్షాలు కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తొలగింపు తర్వాత కూడా ఉగ్రవాదం కొనసాగడంపై అడిగిన ప్రశ్నకు అమిత్‌షా స్పందించారు. ‘‘మోదీ ప్రభుత్వం వచ్చాక పౌర మరణాల్లో 70 శాతం, భద్రతా సిబ్బంది మరణాల్లో 62శాతం తగ్గుముఖం పట్టాయి. ఆర్టికల్‌ 370 తొలగింపుతో ఉగ్రవాదం అంతమైపోతుందని ఎవరూ చెప్పలేదు. వేర్పాటువాదం అంతమవుతుందని నేను చెప్పాను. 2026 నాటికి ఉగ్రవాద ఘటనలు సున్నాకు తీసుకురావడం కోసం ప్రణాళికలు రచిస్తున్నాం’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని